తాజా వార్తలు

Wednesday, 15 June 2016

చంద్రబాబే అసలు విలన్: భూమన

మొదటి రీల్ నుంచి ఆఖరి రీల్ వరకూ చంద్రబాబే నాయుడే అసలు విలన్ అని వైఎస్ఆర్ సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పిల్లనిచ్చిన మామను గద్దెదించి పరలోకానికి పంపింది చంద్రబాబేనన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దాడి చేయడం తప్ప చేసిన అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం లేదన్నారు.

సంకల్ప దీక్ష అన్నది చంద్రబాబుకు లేదని, ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తోందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని భూమన మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రసంగంపై టీడీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 హామీలను అమలు చేయాలని గుర్తు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడమా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు రాజీ పడ్డారన్నారు. ఇక ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఉమ్మడి రాజధానిని వదిలి విజయవాడకు మకాం మార్చారని భూమన ఎద్దేవా చేశారు. బాబు హామీలు నెరవేర్చేవరకూ ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు.

వైఎస్ఆర్ సీపీ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని భూమన సవాల్ విసిరారు. చంద్రబాబు దుష్ట పాలన ఆపేవరకూ వైఎస్ఆర్ సీపీ యుద్ధం చేస్తూనే ఉంటుందన్నారు. బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఉన్మాద రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, రాజధాని భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుకునే దమ్ముందా అని భూమన సవాల్ విసిరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment