తాజా వార్తలు

Thursday, 2 June 2016

వారం రోజుల్లో చెప్పండి

కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై అభిప్రాయం చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు వారం రోజులు గడువు పెట్టింది. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్రం తన అభిప్రాయం చెప్పాలని సూచించింది. గడువులోగా అభిప్రాయం చెప్పకపోతే తాము తయారు చేసిన మాన్యువల్‌ను రాష్ట్రం అంగీకరిస్తున్నట్లుగా పరిగణించి, ఆ ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 27న ఇరు రాష్ట్రాలతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మినిట్స్‌ను గురువారం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది.


దీన్లో ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ప్రస్తావించింది. ఆ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణపై రూపొందించిన మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు అందించింది. దాని ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయి. హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియంత్రణలో ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, అందుకనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా ఈ మాన్యువల్‌ను బోర్డు రూపొందించింది.

అయితే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే యత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదీగాక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో చెప్పాకే బోర్డు నియంత్రణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది. ఈ అంశాల్ని పేర్కొంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు గతంలోనే కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాశారు. అదలా ఉండగానే.. అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు డెడ్‌లైన్ పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment