తాజా వార్తలు

Thursday, 2 June 2016

ఆయనవన్నీ హిట్లర్ ఆలోచనలే: వైఎస్ఆర్‌సీపీ

రాష్ట్ర విభజనకు కారకుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబువి అన్నీ హిట్లర్ ఆలోచనలేనని మండిపడింది. రాష్ట్ర విభజన కోసం ఆయన ఒకటి, రెండు కాదు.. నాలుగుసార్లు లేఖలు ఇచ్చి, విభజనకు లోక్‌సభలో తొలి ఓటు తమ పార్టీదేనని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడితో ప్రకటింపజేశారని ఆ ప్రకటనలో విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర  విభజనకు వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్ష చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.

అవినీతి మీద, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వమమెత్తాలన్న నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం ప్రజల తొలి లక్ష్యం ఇక చంద్రబాబు ప్రభుత్వమే కావాలని అన్నారు. ఓటుకు కోట్ల కేసు కోసం కృష్ణా- గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి, అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేశారని వైఎస్ఆర్‌సీపీ మండిపడింది. ఒకవైపు ఏపీ అభివృద్ధిని, మరోవైపు ప్రాణాధారమైన జలాలను కూడా అమ్మేసిన ముఖ్యమంత్రి ఈరోజు చేసేది నవనిర్మాణ దీక్ష అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించింది.

ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలి.. 11 గంటలకు ఎక్కడివారక్కడ నిలిచిపోవాలి అంటూ చివరికి నియంతృత్వ దేశాల్లో కూడా చేయని వెర్రిమొర్రి ఆలోచనలకు, ఎమర్జెన్సీని మించిన దుష్టపోకడలకు చంద్రబాబు బుర్ర కేంద్రస్థానంగా మారిందని పార్టీ విమర్శించింది. పరిపాలన లేదు, రెండేళ్లుగా చేసిన మంచి లేదు, చెప్పుకోదగ్గ పథకమంటూ ఒక్కటి కూడా లేదని, స్కాములు తప్ప స్కీములు లేవని తెలిపింది. వ్యవసాయం సర్వనాశనం అయిందని, కృష్ణా, గోదావరి ద్వారా రావల్సిన నీటిలో చుక్కను కూడా వదులుకోబోమన్న భరోసా లేదని గుర్తుచేసింది. ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ లేదని, విభజన చట్టాన్ని అమలుచేయించే ప్రయత్నం లేదని, పారిశ్రామిక రాయితీలు, ఉద్యోగావకాశాల ఊసు కూడా లేవని తెలిపింది. ఇప్పుడేం జరుగుతోందో, మూడేళ్లలో ఏం చేస్తారో చెప్పే సత్తా లేదు గానీ, ఈ రాష్ట్రం 2022కి, 2029కి, 2050కి ఎలా అభివృద్ధి అవుతుందో, దానికోసం ఈ రోజు ఏపీ ప్రజలు ఎక్కడివారు అక్కడే నిలిచిపోయి చంద్రబాబు చేయించే నయవంచన ప్రతిజ్ఞను చదవాలా అని ప్రశ్నించింది. హిట్లర్ ఆలోచనా ధోరణికి కొనసాగింపే ఈ నాటకమని, చంద్రబాబు పాలన భయానకం, మాటలు బూటకమని పార్టీ ఆ ప్రకటనలో విమర్శించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment