తాజా వార్తలు

Thursday, 2 June 2016

నీటి మూటలు.. గాలి బుడగలు

చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర ప్రజలను మరోసారి మోసపుచ్చుతున్నారని, అటువంటి ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షకు అనర్హుడని వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. బాబు ఎన్నికల హామీలు నీటి మూటలు, గాలి బుడగలని విమర్శించారు. గురువారం ఆర్.కె.బీచ్ వద్ద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వారు సముద్రం నీటిని మూటలుగా పట్టుకొని, బుడగలను గాలిలోకి వదులుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెండేళ్లుగా మాటలకు, చేతలకు పొంతన లేకుండా మితిమీరిన అవినీతి పరిపాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఎన్నో హామీలిచ్చిందని, ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాన మంత్రి దగ్గర సీరియస్‌గా ప్రస్తావన తీసుకురాలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి విభజన బిల్లులో స్పష్టంగా ఉన్నా ఇప్పటి వరకు జోన్ ఏర్పాటు కాలేదన్నారు. పోల వరానికి జాతీయ హోదా ఇచ్చారు గాని డబ్బులు తెచ్చుకోవట ంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని విషయాల్లో విఫలమైన చంద్రబాబు ఈ రోజు నవనిర్మాణ దీక్ష అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, ఆయన తనయుడు తమకు లబ్ధి చేకూర్చే పనులే తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, కేజీహెచ్‌లో గుండె జబ్బులతో వున్న వారికి సరైన మందులు అందడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 
‘ఎవరి కోసం నవ నిర్మాణం?’
ఎంవీపీకాలనీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించకుండా దీక్షలు, సంకల్ప సభల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాలమహానాడు, సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ ధ్వజమెత్తారు. నవ నిర్మాణ, సంకల్ప దీక్షలను నిరసిస్తూ గురువారం ర్యాలీ చేపట్టారు. ఎంవీపీ కాలనీ ఆళ్వార్‌దాస్ సర్కిల్ వద్ద జరిగిన నిరసన ర్యాలీనుద్దేశించి రత్నాకర్ మాట్లాడారు. ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు లేక ఎన్నో ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కోట్లు కుమ్మరించి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంఘం ప్రతినిధులు దారం జీవన్‌కుమార్, దోమాన చిన్నారావు, ధర్మాల అప్పారావు, కంబాల కృష్ణవేణి, రట్టి కూర్మారావు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment