తాజా వార్తలు

Thursday, 2 June 2016

దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేపట్టండి

కొత్త రాష్ట్రం పేరుతో విజయవాడలో నవనిర్మాణ దీక్ష ఎందుకని.. దమ్ము,సత్తా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని పార్టీలతో కలసి చంద్రబాబు  ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సవాల్ విసిరారు.  మండలంలోని గంగపట్నంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ  హోదా ఇచ్చేది లేదని ఒకపక్క నాయకులు చెబుతుంటే, సీఎం నవనిర్మాణ దీక్షతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని హితవు పలికారు. ఢిల్లీలో దీక్ష చేపడితే కేంద్రప్రభుత్వం దిగి వస్తుందన్నారు.

ఇందుకు వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే సోనియా విభజనకు సాహసించారని,  అయితే ఇపుడు విభజనలో వైఎస్సార్‌సీపీ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విభజనకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడింది వెఎస్సార్ కాంగ్రెస్‌పార్టీయేనని స్పష్టంచేశారు.

 బాబు జీరో.. కేసీఆర్ హీరో
ఎన్నికల మెనిఫెస్టోలో దాదాపు 400 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బాబు వాటిని బంగాళాఖాతంలో తొక్కేశారని ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయన పానలో రాష్ట్రాభివృద్ధి ఇసుమంతైనా లేదన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బాగా పరిపాలిస్తున్నారని, వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్నారన్నారు. అక్కడ ప్రజలు కేసీఆర్‌కు జేజేలు పలుకుతుంటే, ఇక్కడి ప్రజలు చందబ్రాబును చీదరించుకుంటున్నారని తెలి పారు. కేసీఆర్‌ను చూసి చంద్రబాబు పరిపాలన నేర్చుకోవాలని హితవు పలికారు.

కాగా, అబద్ధపు హామీల గురించి ఈ నెల 8న చంద్రబాబుపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ప్రసన్న తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బాలశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment