తాజా వార్తలు

Thursday, 16 June 2016

షీలాకు యూపీ బాధ్యతలు?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత షీలా దీక్షిత్‌ను ప్రకటించే అంశంపై కాంగ్రెస్ తీవ్ర సమాలోచనలు చేస్తోంది. పంజాబ్ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా నియమించే అవకాశాలపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య షీలాగురువారం పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే కీలకమైన యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణుల్ని ఆకర్షించాలంటే సీఎం అభ్యర్థిగా ఆ వర్గానికి చెందినవారినే ప్రకటించాలని ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. షీలా పేరును హైకమాండ్‌కు ఆయనే సూచించినట్లు సమాచారం. దీంతో మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలాకు యూపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.  

మందిర్-మండల్ రాజకీయాల అనంతర పరిస్థితుల్లో అప్పటి వరకూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు బీజేపీ వైపు మళ్లారు. 2012 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో వారు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతంలోని అనేక సీట్ల ఫలితాల్ని వీరే ప్రభావితం చేస్తున్నారు.
 
పంజాబ్ ఇన్‌చార్జిగా తెరపైకి దీక్షిత్ పేరు
మరోవైపు షీలాను పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమిస్తారనే వార్తలూ వినిపిం చాయి. సిక్కు అల్లర్ల ఆరోపణలతో ఇన్‌చార్జి కమల్‌నాథ్ తప్పుకోవడం తెలిసిందే.  ఆ రాష్ట్రంతో సంబంధాలున్న షీలాను ఇన్‌చార్జిగా నియమిస్తే అధికారంలోకి రావడం సులభమని కాంగ్రెస్ ఆలోచన. కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను యూపీలో పార్టీ అధినేతగా చేస్తారన్న వార్తలను గులాం నబీ ఆజాద్ తోసిపుచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment