తాజా వార్తలు

Monday, 13 June 2016

ముద్రగడను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేం…!

ముద్రగడ దీక్ష, రిజర్వేషన్లపై చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు కాపు ప్రముఖులు. చిరంజీవి, దాసరి నారాయణరావు, పళ్లంరాజు, బొత్స, సి.రామచంద్రబయ్య, అంబటి రాంబాబు, కన్నబాబు… వంటి నాయకులంతా సమావేశానికి హాజరయ్యారు. ముద్రగడ దీక్ష, ఏపీకి చెందిన కాపు మంత్రుల ఎదురుదాడి వంటి అంశాలని చర్చించారు నేతలు.

ఏపీ ప్రభుత్వం సామాజిక సమస్యను ఉగ్రవాద సమస్యగా చూస్తోందని ఆరోపించారు దాసరి నారాయణరావు… గతంలో కాపు నేత వంగవీటి రంగాను పోగొట్టుకున్నామని… ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేమని అన్నారు. ముద్రగడ దగ్గరకు ఎవరినీ అనుమతించకపోవడం దారుణమని… కనీసం ముద్రగడో ఫోన్‌ల్లో కూడా మాట్లాడుదామన్నా జామర్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు దాసరి.

ప్రభుత్వం వెంటనే స్పందించి… సమస్య పరిష్కరించాలని దాసరి డిమాండ్‌ చేశారు. ముద్రగడ వెనుక తామున్నామని, కాపులకు అండగా నిలబడతామని చెప్పడానికే తాము ఈ సమావేశం ఏర్పాటు చేశామని దాసరి తెలిపారు. ముద్రగడకు మద్దతు తెలిపేవారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని… ఇది మంచి ప్రయత్నం కాదన్నారు దాసరి నారాయణరావు.

ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయన్నాయని హెచ్చరించారు చిరంజీవి. ముద్రగడ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినా, ఆయనకు ఏదైనా జరిగినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను తలుపులు బద్దలు కొట్టి అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. ముద్రగడ భార్య, కుమారుడు, కోడలు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు చిరంజీవి.

ముద్రగడ కొత్తగా పెట్టిన డిమాండ్లు ఏమీ లేవన్నారు చిరంజీవి… టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవే ముద్రగడ అడుగుతున్నారని తెలిపారు. హామీలను అమలు చేయమంటే ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తుని ఘటనను తాము సమర్థించడం లేదన్నారు చిరంజీవి.
« PREV
NEXT »

No comments

Post a Comment