తాజా వార్తలు

Friday, 24 June 2016

అమరావతిలోనూ ‘ఫ్రీ జోన్’ రగడేనా…!?

సీన్‌ రిపీట్‌ కాబోతోందా? హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ రగడ ఇప్పుడు అమరావతికి అంటుకోనుందా? ఉద్యోగ నియామకాల్లో కృష్ణ, గుంటూరు జిల్లాలకే ప్రాధాన్యం దక్కుతుందనే అనుమానం బలపడుతోందా? ఏపీ సర్కారుకి సీమ సెగ తప్పదా? ఉత్తరాంధ్ర ఉద్యమించే పరిస్థితి వస్తుందా? అనేక ప్రశ్నలకు బీజం వేస్తోంది అమరావతి ఫ్రీ జోన్‌ అంశం.
సేమ్‌ ప్రాబ్లమ్‌… కాకపోతే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధాని కావటంతో ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడ అవసరం అయ్యేవి. అయితే హైదరాబాద్‌ ఆరవ జోన్‌ పరిధిలో ఉంది. మిగిలిన జోన్‌ల వారు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడి పోస్టులకు నాన్‌ లోకల్‌ అయ్యేవారు. దీంతో సమాన హక్కులపై ఉద్యమం మొదలయ్యింది. ఫలితంగా 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14ఎఫ్‌ క్లాజ్‌ని అప్పట్లో కేంద్రం జోడించింది.
దీంతో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ అయ్యింది. ఈ సవరణతో హైదరాబాద్‌లో ఉద్యోగాలకు అన్ని జోన్‌లకూ సమాన అర్హత లభించింది. లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్యకు అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్‌ నగర పోలీసు, సచివాలయం, హెచ్‌వోడీల వంటి ముఖ్యమైన పోస్టులకు ఇది వర్తిస్తుంది. గ్రేడ్‌ ఫోర్‌ వంటి పోస్టుల్లో మాత్రం స్థానికులకే ప్రాధాన్యమిస్తారు.
ఫ్రీ జోన్‌ అంశం సహజంగానే తెలంగాణ వాసులకు ఇబ్బందికరంగా మారింది. ఫ్రీ జోన్‌ పేరుతో సీమాంధ్రవాసులు తమ ఉద్యోగ అవకాశాల్ని ఎగరేసుకుపోతున్నారనే అసంతృప్తి తెలంగాణ ప్రజల్లో మొదలయ్యింది. కాలక్రమంలో అది మరింత బలపడి 14ఎఫ్‌ని ఎత్తివేయాలంటూ కేసీఆర్‌ నిరవధిక నిరాహార దీక్షకి దారితీసింది. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో బలపడిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి చివరికి రాష్ట్ర విభజనకు దారి తీసింది.
2010లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ఎఫ్‌ క్లాజ్‌ని ఎత్తేశారు. దీనితో హైదరాబాద్‌ ఫ్రీజోన్‌గా కాకుండా ఆరవ జోన్‌లో భాగమైంది. సీమాంధ్ర ప్రజలు ఇక్కడి ఉద్యోగాలకు నాన్‌ లోకల్‌ అయ్యారు. రాష్ట్ర విభజనతో ఆ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పడినా… తాజాగా ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ సర్కార్‌ తాజాగా ప్రకటించిన 10 వేల ఉద్యోగాల భర్తీలో కూడా ఈ అంశం కీలకం కాబోతోంది.
ఏపీ రాజధాని పరిధి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ విభాగాల పోస్టులు ప్రకటించినా ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా రిక్రూట్‌మెంట్‌ జరిగే అవకాశాలున్నాయి. ఉదాహరణకు చూస్తే పోలీసు శాఖలో 5,991 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే వీటిలో నాలుగు వేల పోస్టుల్ని గుంటూరు, విజయవాడల్లో భర్తీ చేయబోతున్నారు. దీని వల్ల ఈ రెండు జిల్లాల రెండు, మూడవ జోన్‌ల నిరుద్యోగ అభ్యర్ధులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. మిగిలిన జిల్లాల్లో ఖాళీలు తక్కువ కాబట్టి ఆ మేరకు నిరుద్యోగులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది.
అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరి హక్కు. ఇచ్ఛాపురం నుంచి తడదాకా అన్ని జిల్లాలు రాజధాని నుంచి సమప్రయోజనాలు ఆశిస్తాయి. అన్నిప్రాంతాలనుంచి వచ్చే ఆదాయంతో రాజధానిని నిర్మిస్తున్నా ఉద్యోగాల విషయానికి వచ్చే సరికి మిగిలిన జిల్లాలకు అన్యాయం జరుగుతోందంటున్నారు నిరుద్యోగులు. ఆంధ్రప్రదేశ్‌లో సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నాయి. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేయకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే ముందుకెళితే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ ప్రాంత నిరుద్యోగులు.
హైదరాబాద్‌ని ఫ్రీజోన్‌ చేయాలని గతంలో హడావుడి చేసిన నాయకులు ఇప్పుడు అమరావతి విషయంలో నోరు విప్పటం లేదు. అసలు రాజధాని పరిధి ఏ జోన్‌ కిందికి వస్తుందో కూడా ప్రభుత్వం స్పష్టం చేయకపోవటం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. ఉద్యోగాల భర్తీకి ముందే ప్రభుత్వం ఫ్రీ జోన్‌ పై ఒక నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment