తాజా వార్తలు

Sunday, 5 June 2016

లక్ష ఇళ్లకు పైపు గ్యాస్

తెలంగాణకు పెట్రోలు, డీజిల్, కిరోసిన్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి ప్రత్యేక పైప్ లైన్ నిర్మిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో రెండేళ్లలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లకు పైప్ లైన్ ద్వారా  వంటగ్యాస్ (పీఎన్జీ)ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు పీఎన్జీని సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌ను పటిష్టపరచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అదనపు పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని, త్వరలో పనులు మొదలవుతాయని చెప్పారు. యూపీఏ హయాంలో పైప్ లైన్ల పనులు కొంతమేర పూర్తయినా.. పర్యవేక్షణలో లోపం వల్ల ఇళ్లకు వంటగ్యాస్ పైపులైన్ల అనుసంధానం జరగలేదన్నారు.
ప్రస్తుతం కేవలం 1,140 ఇళ్లకే అందుతున్న పీఎన్జీని 2021 నాటికి రెండున్నర లక్షల ఇళ్లకు అందిస్తామని వెల్లడించారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయాలను ప్రజల మందుంచే ‘వికాస్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కేంద్ర మంచినీరు, పారిశుధ్య శాఖ సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌ను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా వాహనాల్లో సీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ధర్మేంద్ర పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో వాహనాలున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నందున ఇక్కడ సీఎన్జీ వాడకాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం నగరంలో 23 వేల వాహనాలకు మాత్రమే సీఎన్జీ అందుబాటులో ఉందని, అదే ఢిల్లీలో 10 లక్షల వాహనాలకు సరఫరా అవుతోందన్నారు. దీన్ని వీలైనంత మేర విస్తరించేందుకు నగరంలో మరిన్ని సీఎన్జీ బంకులను అందుబాటులోకి తెస్తామన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌ను విస్తరించే క్రమంలో మరోసారి హైదరాబాద్‌కు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు.

రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ పైప్‌లైన్
కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మల్లవరం నుంచి రామగుండానికి ప్రత్యేక గ్యాస్‌పైప్‌లైన్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేజీ బేసిన్లో 3 వేల మీటర్ల లోతుకు వెళ్తేగానీ సహజవాయువు నిక్షేపాలు లభించటం లేదని, గ్యాస్ వెలికితీత భారీ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో మరింత లోతులోని నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ‘‘కేజీ బేసిన్లో అత్యంత విలువైన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలున్నాయి. వాటిని వెలికితీస్తాం. అప్పుడు ఈ ప్రాంతం చమురు, గ్యాస్ హబ్‌గా మారుతుంది. అది యావత్తు దేశానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా మూడేళ్లలో ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతోంది’’ అని వివరించారు.

‘మరుగుదొడ్ల’లో తెలంగాణ వెనుక బాటు
స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్రమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. మరుగుదొడ్ల ఏర్పాటు జాతీయ స్థాయిలో 52.25 శాతంగా నమోదుకాగా తెలంగాణలో కేవలం 38 శాతంగానే ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఇంటింటికి మంచినీటి సరఫరా విషయంలో కేంద్రం చేయూతనందిస్తోందన్నారు. ముద్రబ్యాంకు ద్వారా 3.45 కోట్ల మందికి రూ.1.38 లక్షల కోట్ల మేర రుణాలందాయని, ఇందులో తెలంగాణకు సంబంధించి 4.76 లక్షల మందికి రూ.3,694 కోట్లు అందాయని చెప్పారు. పీఎం గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29 వేల కోట్లతో పనులు చేపడుతున్నామని, 2019 నాటికి ఆరున్నర వేల గ్రామాలకు రోడ్డు వసతి సమకూరుతుందన్నారు. 2014 నాటికి యూపీఏ ఆధ్వర్యంలో రోజుకు 73 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం జరిగితే దాన్ని ఇప్పుడు 100 కి.మీ. పెంచినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్ తోమర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment