తాజా వార్తలు

Friday, 17 June 2016

‘జెంటిల్‌మన్’ సినిమా రివ్యూ…

కథ:ఐశ్వర్య(సురభి), కేథరిన్(నివేత థామస్) ఇద్దరు ఫ్లైట్ లో కలుసుకుంటారు. మాటల మధ్యలో ఒకరి ప్రేమ విషయాలు మరొకరితో షేర్ చేసుకుంటారు. కేథరిన్, గౌతమ్(నాని) అనే అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ కేథరిన్ ను తన మావయ్య డావిడ్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. గౌతమ్ కు, డావిడ్ కు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఈలోపు కేథరిన్ తన ఆఫీస్ పని మీద లండన్ కు వెళ్తుంది. అలానే ఐశ్వర్య కు తన ఇంట్లో వాళ్ళు జై(నాని) అనే బిజినెస్ మెన్ ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. జై, ఐశ్వర్యలు ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే వంశీ(అవసరాల శ్రీనివాస్) అనే వ్యక్తి, ఐశ్వర్య కుటుంబానికి సన్నిహితుడు. ఐశ్వర్య తండ్రి, వంశీ చాలా క్లోజ్ గా ఉంటారు. వంశీ, ఐశ్వర్య వాళ్ళ కంపెనీకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. కుటుంబంలో వ్యక్తిగా వంశీను ట్రీట్ చేస్తుంటారు. ఇది ఇలా ఉండగా.. ఐశ్వర్య, కేథరిన్ లు ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. అక్కడున్న జై ను చూసి కేథరిన్ గౌతమ్ అనే అనుకుంటుంది. కానీ అతను తనను పట్టించుకోకుండా.., ఐశ్వర్య తో వెళ్ళడం చూసి తట్టుకోలేకపోతుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి గౌతమ్ ఇంటికి వెళ్తుంది. గౌతమ్ చనిపోయాడని తన తల్లి కేథరిన్ కు చెప్తుంది. గౌతమ్ ఎలా చనిపోయాడు..? తనను చంపింది ఎవరు..? గౌతమ్ చనిపోయిన తరువాత కేథరిన్ ఏం చేసింది..? జై, గౌతమ్ ఒక్కరేనా..? లేక ఇద్దరా..?. అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!
నటీనటుల పనితీరు:
జై, గౌతమ్ పాత్రల్లో నాని పెర్ఫార్మన్స్ అదుర్స్ అనే చెప్పాలి. అంత అధ్బుతంగా నటించాడు. రెండు పాత్రల్లో వేరియేషన్ చాలా బాగా చూపించాడు. ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. కేథరిన్ పాత్రలో నివేత సహజ నటనను కనబరిచింది. తన నటనతో ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఎమోషన్స్ ను బాగా పండించింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల నటనతో పోలిస్తే నివేత అధ్బుతంగా నటించిందనే చెప్పాలి. ఐశ్వర్య పాత్రలో సురభి కూడా చక్కగా నటించింది. సినిమా మొత్తం ఈ మూడు క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నాని తల్లి పాత్రలో రోహిణి ఎప్పటిలానే న్యాచురల్ గా నటించింది. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ బాగా నవ్వించాడు. మధు నందన్, సత్యం రాజేష్, ఆనంద్, తనికెళ్ళ భరణి, శ్రీముఖి వారి పాత్రల పరుధుల్లో చక్కగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు పెద్ద ప్లస్ మణిశర్మ సంగీతం. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ తరహా జోనర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. దానికి పరిపూర్ణ న్యాయం చేశాడు మణిశర్మ. ఈ సినిమాకు సోల్ సంగీతమే. కొన్ని సీన్లు ఎలివేట్ అవ్వడానికి కూడా కారణం అదే. సినిమాకు మంచి టాక్ వస్తోందంటే అందులో మణిశర్మ ది కీలకపాత్ర ఉంటుంది. విందా ఫోటోగ్రఫి న్యాచురల్ గా ఉంది. కొడైకెనాల్ లొకేషన్స్ బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి కథనం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెల్లింది. ఓ తమిళ రైటర్ రాసుకున్న కథను తీసుకొని కొన్ని మార్పులు చేసి చక్కగా ప్రెజెంట్ చేయడం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.
విశ్లేషణ:
సినిమా మెల్లగా మొదలయ్యి అంతే స్లో గా మొదటి భాగం నడుస్తుంది. రెండు ప్రేమ కథలను వివరించి, ఓ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. పాటలు సంధర్భానుసారంగా ఉంటాయి. మెలోడీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పార్టీ సాంగ్ కూడా బావుంటుంది. నాని ఇద్దరా.. ఒకరా.. అని తెలుసుకునే ప్రాసెస్ లో కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. సెకండ్ హాఫ్ ఉన్నంత త్రిల్లింగ్ గా ఫస్ట్ హాఫ్ ఉండదు. కానీ ఎక్స్ట్రాడినరీ అనిపించే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఫైనల్ గా కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఓ కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలనుకున్న ఇంద్రగంటి ప్రయత్నం సక్సెస్ అయింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమా రాలేదనే చెప్పాలి. మూస ధోరణిలో నడుస్తున్న టాలీవుడ్ సినిమాల్లో నాని ఎప్పటికప్పుడు తను భిన్నమని నిరూపించుకుంటున్నాడు. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఇలా వరుస హిట్స్ తో ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment