తాజా వార్తలు

Sunday, 12 June 2016

ఎర్ర’దొంగల’ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం సిద్ధం…!

బడా రెడ్‌శాండిల్‌ స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాబితా సిద్ధమైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వేయి కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎర్రదొంగల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

గత 15ఏళ్లలో శేషాచలం నుంచి తరలిపోయిన ఎర్రచందనం విలువ అధికారికంగానే అక్షరాలా 25 వేల కోట్ల రూపాయిలు. అందులో స్మగ్లర్లు సంపాదించుకుంది ఏకంగా 15 వేల కోట్లు. మిగిలింది కూలీలు, చందనం తరలింపునకు ఖర్చైందని అంచనా… అడవిని దోచేస్తూ కోటీశ్వరులుగా మారిపోయారు కిలాడీలు…
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎర్రదొంగలపై ఉక్కుపాదం మోపింది. వందలమందిని అరెస్ట్‌ చేసింది. స్మగ్లర్ల ఆస్తుల జాబితాను సిద్ధం చేసింది. చిత్తూరు ,కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సంబందించిన ఎర్రవ్యాపారులతో పాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఢిల్లీ, మయన్మార్ లతో పాటు దుబాయిల్లోని టాప్‌టెన్‌ స్మగ్లర్ల అస్తుల వివరాలను సేకరించింది.

ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే వందకోట్లు… బహిరంగ మార్కెట్లో వేయి కోట్లకు పైగా ఉంటుందని అంచనా… ఇక కొల్లం గంగిరెడ్డి ఆస్తులపై ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ ఓ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇతని ఆస్తులు 250 కోట్లకు పైనే… కడప జిల్లాకు చెందిన ఇద్దరు నేతల ఆస్తులనూ మదింపు చేస్తున్నట్లు సమాచారం.

స్మగ్లర్లు సంపాదించిన ఆస్తుల వివరాలు చూసిన వారికి దిమ్మతిరిగిపోతోంది. మయన్మార్‌లో పుట్టి చెన్నయ్‌కు కూలీగా వచ్చి స్మగ్లర్‌గా మారిన లక్ష్మణ్‌ ఆస్తి ఇప్పుడు వందకోట్లకు పైనే… బెంగాల్‌కు చెందిన సంగీతా చటర్జీతో ఇతను సహజీవనం చేస్తున్నాడు. ఇతని చుట్టూ 50మంది ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ప్రస్తుతం ఇతను పీడీయాక్ట్‌ కింద జైల్లో ఉన్నాడు. స్మగ్లర్‌ అవతారం ఎత్తిన మాజీ పోలీస్‌ అధికారి మూసా ఆస్తి కూడా వందకోట్లు దాటింది.

ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేయడాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్నాడు ఇతను. కర్నూల్‌కు చెందిన మస్తాన్‌వలీ, చెన్నైకి చెందిన నాగరాజన్‌, సెల్వరాజ్‌ మిజోరాంకు చెందిన శ్యామ్యూల్‌, కర్ణాటకకు చెందిన హమీద్‌, ఢిల్లీ స్మగ్లర్‌ విక్రమ్‌లు కూడా వందకోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment