తాజా వార్తలు

Monday, 6 June 2016

కృష్ణా బోర్డు పరిధి దాటుతోంది

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తన పరిధిని అతిక్రమించి నీటి కేటాయింపుల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ, ఏపీలకు నీటి కేటాయింపుల బాధ్యతను తన వద్దే ఉంచుకుంటూ బోర్డు రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను తక్షణం నిలిపేయాలని కోరారు. సోమవారం ఆయన ఉమాభారతితో ఇక్కడ ఆమె నివాసంలో సమావేశమై మాట్లాడారు. అనంతరం వివరాలను టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి విలేకరులకు వెల్లడించారు.
‘‘కృష్ణా బోర్డు అత్యుత్సాహ వైఖరితో చట్టాన్ని అతిక్రమించజూస్తోంది. చ ట్టాన్ని ఉల్లంఘించే విపరీత ప్రయత్నాలతో వ్యవహరిస్తున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 85 (బి), 87 (1) ప్రకారం బోర్డుకు ఉన్న బాధ్యత ట్రిబ్యునల్ కేటాయింపులను అమలు చేస్తూ నియంత్రించడం మాత్రమే. కానీ, బోర్డు తనకు లేని అధికారాన్ని తీసుకుని... కేటాయింపులు చేసే బాధ్యతలను అట్టిపెట్టుకుంటూ ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేసి కేంద్రానికి పంపింది. ఏపీ సర్కారు రాసిస్తే, దానిపై బోర్డు సంతకం పెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ ముసాయిదాను అంగీకరించరాదని, తక్షణమే కేంద్రం నిలుపుదల చేయాలని మంత్రిని కోరాం. ఆమోదిస్తే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశాం. వీటన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంగళవారం నీటి పారుదల శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటుచేశారు. ఆ భేటీలో అన్ని విషయాలనూ సమగ్రంగా వివరిస్తాం.’’ అని తెలిపారు.

 ఏపీ పట్ల బోర్డు పక్షపాతం
 ఏపీ పట్ల కృష్ణా బోర్డు పక్షపాతం చూపుతోందని హరీశ్ ఆరోపించారు. ‘‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజా కేటాయింపులపై సుప్రీంకోర్టులోనూ, ట్రిబ్యునల్‌లోనూ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం బచావత్ అవార్డు అమల్లో ఉంది. ఆ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గుండుగుత్తగా నీళ్లు కేటాయించిందే తప్ప ప్రాజెక్టులవారీగా కాదు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన తొలి ఏడాదే తాత్కాలికంగా నీటి వాడకంపై అవగాహన కుదిరింది. దాని ప్రకారం ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇదేమీ తుది నిర్ణయం కాదు. తుది నిర్ణయం సుప్రీం, ట్రిబ్యునల్ చేతుల్లో ఉంది. ఆ నిర్ణయం వెలువడకముందే కృష్ణా బోర్డు తన పరిధిపై నోటిఫికేషన్ ముసాయిదా పంపింది.

శ్రీశైలం ఎగువనున్న జూరాలతో ఏపీకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా బోర్డు దాన్ని కూడా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటూ ముసాయిదా రూపొందించింది. ఏపీలోని పులిచింతల, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా వంటి వాటిపైనేమో నామమాత్రపు నియంత్రణతో సరిపెట్టింది. మిగులు జలాలపై ఆధారపడ్డ తెలంగాణకు చెందిన కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు కేవలం వరద జలాలనే వాడుకోవాలని చెప్పింది. అదే ఏపీలో మిగులు జలాలపై ఆధారపడ్డ వలిగొండ, హెచ్‌ఎన్‌ఎస్, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి వరద జలాల ప్రస్తావన లేదు. కేసీ కెనాల్, కృష్ణా డెల్టాలకు కేటాయింపులకు మించి దశాబ్దాలుగా వాడుకుంటున్నా వాటిపై నియంత్రణ పెట్టకుండా పూర్తిగా వదిలేశారు. బోర్డు పక్షపాతానికి ఇవి నిదర్శనం మాత్రమే’’ అని విమర్శించారు.

 రాధామోహన్‌సింగ్‌తో భేటీ: కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌తో కూడా హరీశ్ భేటీ అయ్యారు. మండలాల్లో నిర్మించ తలపెట్టిన గోడౌన్లకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. కరువు నిధులను రూ.791 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మొత్తం రూ.1,400 కోట్లు విడుదల చేయాలని కోరారు.

 తెలంగాణకు మరో 90 టీఎంసీలు ఇవ్వాలన్నాం
 ‘‘ఏపీ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు రాగానే 90 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వర్తిస్తాయని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు చెప్పింది. 


తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్రలకు 45 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. పట్టిసీమకు అనుమతులు రాగానే మరో 90 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఇందులో 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు త్వరగా నిధులు విడుదల చేయాలని, ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరాం. ఏఐబీపీ ప్రాజెక్టులు, ప్రస్తుతం అమల్లో ఉన్న 15 జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం కొలిక్కివచ్చాక తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు’’ అని హరీశ్ వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment