తాజా వార్తలు

Friday, 17 June 2016

భారత్-థాయ్ భాయ్ భాయ్!

రక్షణ, తీరప్రాంత భద్రతతోపాటు ఆర్థిక, సైబర్ సెక్యూరిటీ, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్-థాయ్‌లాండ్‌నిర్ణయించాయి. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారిని పూర్తి చేయటంతోపాటు ఈ మూడు దేశాల మధ్య మోటారు వాహన ఒప్పందం జరగటాన్ని భారత-థాయ్‌లాండ్ దేశాలు ప్రాధాన్యతాంశంగా గుర్తించాయని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు త్వరలోనే 70 వసంతాలు పూర్తవనున్నందున భారత్‌లో థాయ్ ఉత్సవం.. థాయ్‌లాండ్‌లో భారత్ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 2016-19 కాలానికి ‘సంస్కృతి మార్పిడికి ప్రత్యేక కార్యక్రమం’, నాగాలాండ్ వర్సిటీ, థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ వర్సిటీ మధ్య ఒప్పందాలు కుదిరాయి.
 థాయ్ టూరిస్టులకు ఈ-వీసాలు
 భారత్‌లోని బౌద్ధ స్థలాలను చూసేందుకు వచ్చే థాయ్‌లాండ్ పర్యాటకులకు డబుల్ ఎంట్రీ ఈ-టూరిస్టు వీసాలను ఇచ్చేలా కొత్త నిబంధనలను మోదీ ప్రకటించారు.  థాయ్‌లాండ్ ‘లుక్ వెస్ట్’ పాలసీ, భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి మధ్య వ్యూహాత్మక సమన్వయం కారణంగానే ఇరుదేశాల సంబంధాలు బలంగా మారాయన్నారు. వీరిద్దరి సమావేశం తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదంతోపాటు సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్, సీమాంతర ఆర్థిక నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటి అంశాల్లోనూ పరస్పర సహకారానికి ఆమోదం తెలుపుకున్నామన్నారు.

 తీరం మరింత భద్రం
 భారత్-థాయ్ దేశాలు తీరప్రాంత పొరుగు దేశాలుగా ఉన్నందున తీర ప్రాంత భద్రత, రక్షణ రంగాల్లో మరింత సహకారంతో ముందుకెళ్లేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. మౌలికవసతుల అభివృద్ధి, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో థాయ్‌లాండ్ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ‘వస్తువులు, సేవలు, మూల ధనం, మానవ వనరుల వంటి అంశాల మార్పిడిపై స్పష్టత ఉంది. అయితే వీటి ప్రసారానికి సంబంధించిన బలమైన మార్గాన్ని (జల, వాయు, భూతల) నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆగ్నేయాసియాకు సంబంధాలను కలపటం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని  చెప్పారు.

 థాయ్ యువతకు శిక్షణ: త్వరలోనే థాయ్ భాషలోకి భారత రాజ్యాంగాన్ని తర్జుమా చేయనున్నట్లు మోదీ చెప్పారు. అక్కడి థాయ్ విద్యార్థులకు భారత్‌లో ఐటీపై, అక్కడి పోలీసు అధికారులకు సీబీఐ శిక్షణ ఇచ్చేందుకూ మోదీ అంగీకారం తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment