తాజా వార్తలు

Thursday, 2 June 2016

మళ్లీ దాయాదుల సమరం

ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్ ఖరారు అయింది. వచ్చే ఏడాది జూన్ 1నుంచి 18 వరకు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 4న బర్మింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌తో తలపడిన 11 సార్లూ ఓడిన పాకిస్తాన్... ఒక్క చాంపియన్స్ ట్రోఫీలోనే ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 1 గెలిచి 2 ఓడింది. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీకి సరిగ్గా ఏడాది ముందు ఐసీసీ బుధవారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది.
30 సెప్టెంబర్, 2015నాటికి ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు దీనికి క్వాలిఫై అయ్యాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్ తొలి సారి ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోగా... జింబాబ్వే కూడా దూరమైంది. జూన్ 1న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండు గ్రూప్‌లనుంచి టాప్-2 జట్లు సెమీస్‌లోకి అడుగు పెడతాయి. 18న ఓవల్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. 2004, 2013 తర్వాత ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడో సారి.


 గ్రూప్ ‘ఎ’ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్
 గ్రూప్ ‘బి’ - భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
« PREV
NEXT »

No comments

Post a Comment