తాజా వార్తలు

Tuesday, 7 June 2016

'చంద్రబాబుకు ఆ దమ్ము ఉందా?'

రెండేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిందేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ఇచ్చిన హామీలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని ఆరోపించారు. ఎంతసేపటికి ఆయన అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప కార్యచరణ మాత్రం శూన్యం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు నిజాలు చెబితే బాగుండేదని అన్నారు. రుణాలు మాఫీ చేశామని, అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని, డోక్రా మహిళలు రుణాల బారిన లేరని చెబితే బాగుండేదని చెప్పారు.
అసలు అలా చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా అని.. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బలహీన వర్గాల సంక్షేమ అంశం గాలికొదిలేశారని అన్నారు. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం జరిగిందని చెప్పారని, అలా ఎక్కడ జరిగిందో చూపించాలని నిలదీశారు.

కృష్ణా జలాలతో ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని అన్నారు. బుధవారం ప్రభుత్వంపై అన్ని జిల్లా పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ జన్మదినం సందర్బంగా జూలై 8న అన్ని చోట్ల గడపగడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఈ నెల 13న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరిస్తారని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment