తాజా వార్తలు

Sunday, 19 June 2016

ఇది దోపిడీదారుల ప్రభుత్వం

రాష్ట్రంలో దోపిడీదారుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు దుయ్యబట్టారు. వనరులను కొల్లగొట్టి, కాంట్రాక్టులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ, పదాధికారుల ముగింపు సమావేశంలో మురళీధర్‌రావు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ కానుంది. కార్యకర్తలందరూ సంఘర్షణకు సిద్ధంగా ఉండాలి. ప్రజాసమస్యలపై పోరాడేందుకు ఉద్యమబాట పట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అనూహ్యంగా బలహీనపడ్డాయి.
ప్రజలు తమ గొంతు వినిపించాలని బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నేతల పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ రాష్ట్రంలో అనునిత్యం ప్రజాస్వామ్యం అపహరణకు గురవుతోందన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క ఎంపీనీ ప్రలోభపెట్టలేదన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేక పలు ప్రజోపయోగ బిల్లులకు కాంగ్రెస్ అడ్డుపడుతున్నా తాము ఆ పని చేయడం లేదన్నారు.  కాంట్రాక్టుల కోసం పార్టీని అమ్ముకునే వ్యక్తులు బీజేపీలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతూ అంతరించిపోయే స్థితిలో ఉందని మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు.

2014 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా నాయకులు సిద్ధం కావాలన్నారు. నిజమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు ప్రతిపక్షంగా పోరాడాల్సి ఉంటుందన్నారు. అందుకోసం పార్టీని గ్రామ స్థాయి వరకు పటిష్టం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

 బీజేపీ వస్తేనే బంగారు తెలంగాణ: దత్తాత్రేయ
 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరువు సాయం కింద కేంద్రం రూ. 790 కోట్ల అందించినా రైతులకు ఇంకా అందించలేదన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు పనులు పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. వాస్తవాలను కప్పిపెట్టి టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి బడా కంపెనీలు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు... ముందుగా మూతపడుతున్న పరిశ్రమల గురించి ఆలోచించాలని దత్తాత్రేయ హితవు పలికారు. 4 నెలలుగా జీతాల్లేక రోడ్డునపడ్డ నిజాం షుగర్స్ సిబ్బందిని ఆదుకోవాలని ఆయన సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment