తాజా వార్తలు

Friday, 10 June 2016

ఇది ‘మోదీ సూత్రం’

ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన చరిత్రాత్మకమైనదని పేర్కొన్న ఒబామా ప్రభుత్వం.. భారత్-అమెరికా సంబంధాలపై మోదీ ఆకాంక్షలను ‘మోదీ సూత్రం’గా అభివర్ణించింది. ‘‘ఈ వారంలో భారత ప్రధాని పర్యటనలో అతి ముఖ్యమైన ఫలితం.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఆయన విస్పష్టంగా వివరించిన విజన్. గత కాలపు సందేహాలను అధిగమించి రెండు దేశాల మధ్య సంగమాన్ని, మన ఉమ్మడి ప్రయోజనాలను ఆలింగనం చేసుకునేలా ఆయన విశదీకరించిన విదేశాంగ విధానాన్ని నేను ‘మోదీ సూత్రం’గా పిలుస్తున్నా’’ అని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి సహాయ మంత్రి నిషాదేశాయ్ బిస్వాల్ పేర్కొన్నారు. అమెరికా మేధో సంస్థ హెరిటేజ్ ఫౌండేషన్, భారత్ మేధో సంస్థ ఇండియా ఫౌండేషన్‌లు ఉమ్మడిగా గురువారం వాషింగ్టన్‌లో ‘మోదీ పర్యటనలో భద్రత, వ్యూహాత్మక ఫలితాలు’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆసియా నుంచి ఆఫ్రికా దాకా, హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా శాంతి, సుసంపన్నత, సుస్థిరతలకు భారత్-అమెరికా భాగస్వామ్యం లంగరుగా ఉండగలదని కూడా మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ఆమె ఉటంకించారు.

 ముగిసిన  విదేశీ పర్యటన.. మోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఢిల్లీ తిరిగి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో వాషింగ్టన్‌లో జరిపిన భేటీ, ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త భేటీలో చరిత్రాత్మక ప్రసంగం ఈ పర్యటనలో ముఖ్యాంశాలు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో అమెరికాతో పాటు అఫ్గాన్, ఖతర్, స్విట్జర్లాండ్, మెక్సికో ల్లో మోదీ పర్యటించారు.

 ఒబామా కుటుంబం భారత్‌కు మారిపోతుందేమో?!: శివసేన
 ఒబామాతో ప్రధాని మోదీ సాన్నిహిత్యాన్ని బీజేపీ కీలక మిత్రపక్షమైన శివసేన వ్యంగ్యంగా విమర్శిస్తూ.. ‘అమెరికా అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత ఒబామా కుటుంబం భారత్‌కు మారిపోతుందేమో!?’ అని అని తన అధికార పత్రిక సామ్నాలో వ్యాఖ్యానించింది.

 ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై 24న సియోల్‌లో మళ్లీ చర్చ
 వియన్నా: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వం అంశాన్ని.. ఈ నెల 24న సియోల్‌లో జరగనున్న ప్లీనరీలో ఎన్‌ఎస్‌జీ చర్చకు చేపట్టనుంది. వియన్నాలో గురువారం జరిగిన భేటీలో భారత సభ్యత్వం అంశంపై జరిగిన చర్చ ఎటూ తేలలేదు. భారత్‌కు సభ్యత్వం కోసం అమెరికా పట్టుపడుతున్నా, బృందంలోని సభ్యదేశాల్లో చాలా దేశాలూ మద్దతిస్తున్నా.. చైనా వ్యతిరేకిస్తోంది. కొత్త దరఖాస్తుదారుల కోసం ఎన్‌ఎస్‌జీ నిర్దిష్టమైన అర్హతలను సడలించరాదంటోంది. సున్నితమైన అణు సాంకేతికత అందుబాటును ఎన్‌ఎస్‌జీ నియంత్రిస్తుంది. భారత్ ఇంకా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఒప్పందం చేయనందున సభ్యత్వం ఇవ్వరాదంటూ వ్యతిరేకించిన పలు సభ్య దేశాలు.. తమ వైఖరిని సడలించి రాజీ కోసం ప్రయత్నించటానికి సిద్ధపడ్డా, చైనా మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. మొత్తం 48 సభ్య దేశాల్లో ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేసినా.. భారత ప్రయత్నం విఫలమవుతుంది. న్యూజిలాండ్, ఐర్లండ్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రియాలు కూడా భారత్‌కు సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment