తాజా వార్తలు

Sunday, 5 June 2016

చేతకాకుంటే తప్పుకోండి

‘‘తెలంగాణ అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదు. ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? మాకు దురాశ, పేరాశ లేదు. ప్రజలు బాగుండాలనేది మా అంతిమ లక్ష్యం. ఆ సోయి ఉండబట్టే నిలబడ్డాం. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లం..’’ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా పయనించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జి.రవీందర్రావు ఆధ్వర్యంలో ‘రెండేళ్ల తెలంగాణ- ప్రజా ఆకాంక్షలు- ప్రభుత్వ తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ‘రెండేళ్ల టీఆర్ఎస్ పాలన-ఒక పరిశీలన’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగతా జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని, తాటిచెట్టు ఏ డిపార్టుమెంట్ కిందకు వస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక గీతకార్మికుడు తాటిచెట్టు పైనుంచి పడి చనిపోతే అది తమ పరిధి కాదంటూ హార్టికల్చర్, ఎక్సైజ్ శాఖలు తప్పించుకున్నాయన్నారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు.

పనితీరుకు గెలుపే నిదర్శనం కాదు: ప్రొఫెసర్ హరగోపాల్
రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తంలో తెలంగాణకు ప్రత్యేకత ఉందని, నక్సల్బరి, భూస్వామ్య, ఆంధ్ర పెట్టుబడిదారి విధానాలపై తిరగబడిన చరిత్ర ఇక్కడి ప్రాంత సొంతమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ కింద భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఉద్యమిస్తున్నా... ఏ ఒక్క మీడియా బయటి ప్రపంచానికి చూపకపోవడం దురదృష్టకరమని సామాజిక వేత్త ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజల గొంతు వినిపించకుండా నొక్కేస్తున్నారని మండిపడ్డారు.

విద్యుత్ ప్రాజెక్టులు గుదిబండలే: రఘు
 ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడుతుందని, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలపై రూ.9 వందల కోట్ల భారం పడుతుందన్నారు. దామరచర్ల ప్రాజెక్టు వల్ల రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లనుందన్నారు. ఇలా విద్యుత్ రంగంలోనే 32 సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం ఒక్కదానికి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పైగా రెగ్యులేటరీ కమిషన్కు వెళ్లరాదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదన్నారు. వ్యవసాయానికి 40 శాతం విద్యుత్ తగ్గడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ సమస్య కనిపించడంలేదని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment