తాజా వార్తలు

Sunday, 12 June 2016

కోదండరాం రాయని డైరీ

యూనివర్సిటీ పిలగాండ్లకు జెప్పిన. అబిడ్స్‌కి బోయేటప్పుడు నేను గూడ వస్తనని. అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతరు. ముప్పై రోజులల్ల ఇంగ్లిష్, ముప్పై రోజులల్ల హిందీ, ముప్పై రోజులల్ల తమిళం పుస్తకాలు ఉంటయ్ అక్కడ. గట్లనే ముప్పై రోజులల్ల మనకు రావొద్దనుకున్న భాష ముక్కున బడకుండా ఎట్ల దాస్కోవాల్నో నేర్పించే బుక్కు కూడా ఉంటే బాగుంటది. దాన్నెవరైన రాసి బుక్కేసిన్రేమో తెల్వది. గానీ అసొంటి బుక్కు ఉండాలె.
 తెలంగాణ వచ్చినంక, మినిస్టర్లైనంక నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగ దీశ్‌రెడ్డి.. ఏదో కొత్త భాష మాట్లాడుతుండ్రు. ఆంధ్రోల్ల భాషే నయంగుంటది. గట్ల మాట్లాడుతుండ్రు! బాల్క సుమన్ ఢిల్లీల విలేకర్ల మీటింగ్ బెట్టి నోటికొచ్చిన భాష మాట్లాడిండు. అమెరికా పోయొచ్చినంక నాకేదో అయ్యిందట. ఏమైతది! నీకు భయమైతది. రాజేంద రైతే ‘పార్టీ బెట్టి మాట్లాడు కోదండ రామ్’ అంటున్నడు! మాట్లాడేటందుకు పార్టీ వెట్టాల్న? నీగ్గావాలె పార్టీ.. మంత్రి అయ్యేటందుకు. నాకెందుకు?

నేను ఏమన్న! నీకు కావల్సినట్టు గాదు, జనానికి ఏం గావాల్నో గది చెయ్యిమన్నా. అంతే గదా. గింత పెద్ద ఉద్యమం నడిపి ఆంధ్రా పాలకుల్ని తరిమినం. వాళ్లు ఇక్కడ జేసినయన్నీ వాళ్లతోనే పోవాల్నా లేదా? మల్లా హైద్రాబాదేనా? మల్లా గీ రియల్ ఎస్టేట్ డీలర్లు, కార్పొరేట్ శక్తులేనా? తెలంగాణకు వేరే అభివృద్ధి లేదా? తెలంగాణ సంస్కృతి అభివృద్ధి చెందకూడదా? సీతాఫల్ మనకు ఒక అస్తిత్వం గదా. అది ఒక్క మన దగ్గరే దొరుకుతది గదా. ఒక్క సీతాఫల్ ఫెస్టివల్ చేసినమా? నేను మొన్న అమెరికా పోతే నాకు ఆశ్చర్యమైంది. ఆ ఊళ్లల్ల ఎల్లిపాయలు పండుతయట. ఎల్లిపాయల ఫెస్టివల్ పెట్టుకుంటరు వాళ్లు!  

 నాయకులు ప్రజల వెనకాలె ఉండాలె. ముందు గాదు. ప్రజలు ఎటు పొమ్మంటే అటుపోవాలె. గీ నాయకులు అట్లా జేస్తున్నరా? చేయాలనుకున్నదే చేస్తున్నరు. అమెరికా పోయినప్పుడు అక్కడి ప్రొఫెసర్లు జె ప్పిన్రు నాకు. ప్రపంచంలో ఎక్కడ గూడా గిట్ల ప్రజల తరుఫున నిలబడి ప్రభుత్వానికి ‘మాకిది కావాలె’ అని చెప్తున్న ప్రజాసంఘాలు తెలంగాణలో తప్ప లేవట! ప్రతిపక్షం అధికారం కోసం కొట్లాడుతది. అధికారపక్షమేమో పవర్‌లో కూర్చోవాలని ప్రయత్నం జేస్తది. జేఏసీకి ఈ రెండు కోరికలూ లేవు. జేఏసీ వీళ్లతో లేదు. వాళ్లతో లేదు. ప్రజలతో ఉంది.

 ‘ఎవరో ఉన్నరు వెనుక’ అంటున్నడు మినిస్టర్ జోగు రామయ్య. ఎవరుంటరు నా వెనుక. వచ్చి చూడు. హరగోపాల్ ఉంటడు. సచ్చిపోయిన ప్రొఫెసర్ జయశంకర్‌గారు ఉంటరు. మా ముందట ప్రజలుంటరు. విద్యార్థులుంటరు. నిరుద్యోగు లుంటరు. పైసల్లేని రైతులుంటరు. గిప్పుడు మెదక్ జిల్లా ఉంది. మల్లన్నసాగర్ బాధితులున్నరు. గీ ప్రభుత్వం గిట్లనే ఉంటే.. వచ్చే మూడేండ్లల్ల మల్లా తెలంగాణ మొత్తం మా ముందట ఉంటది. ప్రజలు ముందుండి నడిపిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినంక ప్రజల్ని వెనకొదిలి, ముందటికి పోతమంటే తెలంగాణ ఊకుంటదా? మల్లా జెండా ఎత్తకుంటదా? మల్లా ‘జై తెలంగాణ’ అనకుంటదా?
« PREV
NEXT »

No comments

Post a Comment