తాజా వార్తలు

Friday, 3 June 2016

‘శ్రీ శ్రీ’ రివ్యూ…

కథ:
ఓ ముగ్గురు దుర్మార్గుల కారణంగా తన ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకొన్న వృద్ధుడు శ్రీ శ్రీ (కృష్ణ). కోర్టులో తనకు న్యాయం జరగకపోవడంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగి వారిని హతమార్చాలనుకొంటాడు. శ్రీ శ్రీ నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారి తీసింది? ఆ ముగ్గురినీ ఈ విధంగా చంపాడు? పోలీసుల బారి నుంచి ఎలా తప్పించుకొన్నాడు? అనేది మిగతా కథ!


నటీనటుల పనితీరు:
వ్యక్తిగా 75 ఏళ్ళు, నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సూపర్ స్టార్ కృష్ణ “శ్రీ శ్రీ” సినిమాతో తన సీనియారిటీని మరోమారు నిరూపించుకొన్నారు. ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది… “ఆయన స్టైలే సపరేటు” కదా. అదే తరహాలో “శ్రీ శ్రీ” పాత్రకు తనదైన శైలిలో ప్రాణ ప్రతిష్ట చేశారు. కృష్ణకు జంటగా ఆయన నిజజీవిత భాగస్వామి విజయనిర్మల నటించడం ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది. కృష్ణ కూతురు పాత్రలో సమాజం పట్ల బాధ్యత కలిగిన పాత్రికేయురాలైన శ్వేత పాత్రలో “శ్రీమంతుడు” ఫేమ్ అంగనా రాయ్ చక్కగా నటించింది. శ్వేత మర్డర్ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో నరేష్, గూడెం పెద్దగా సాయికుమార్ లు ఒదిగిపోయారు. అక్రమార్కులుగా మురళీ శర్మ, పోసానిలు తమ పాత్రలకు న్యాయం చేశారు. పోసాని చేత చేయించాలనుకొన్న కామెడీ సరిగా పండలేదు.


సాంకేతికవర్గం పనితీరు: 
ఇ.ఎస్.మూర్తి సమకూర్చిన బాణీలు సోసోగా ఉన్నాయి. రివెంజ్ సీన్స్ లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు కానీ.. సెంటిమెంట్ సీన్స్ వచ్చే ఆర్.ఆర్ 80వ దశకంలోని సినిమాలను తలపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా పనితనం బాగుంది. మాగ్జిమమ్ కలర్ ఫుల్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణగారిని చాలా అందంగా చూపించాడు. రామ్ కంకిపాటి కథ గతంలో తెలుగులో రూపొందిన “సర్పయాగం” చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కొత్తదనం అనేది ఎక్కడా కనిపించదు. ముగ్గురు నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి.


స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:
“సంక్రాంతి” లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించిన సీనియర్ దర్శకులు ముప్పాలనేని శివ కొంత విరామానంతరం “శ్రీ శ్రీ”తో మన ముందుకొచ్చారు. కృష్ణగారిని ఎక్కడా కష్టపెట్టకుండా కేవలం ఆయన హావభావాలతోనే కథను నడిపించేలా కథనం తయారు చేసుకొన్నాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ను పార్ట్ పార్ట్లుగా చెప్పడం వలన ఆడియన్స్ చాలా వరకూ కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అలాగే చాలా సందర్భాల్లో ప్రేక్షకులకు సినిమా చూసేప్పుడు కలిగే అనుమానాలను కేవలం డైలాగుల రూపంలోనే నివృత్తి చేసేందుకు ప్రయత్నించడం సింక్ అవ్వలేదు. అలాగే పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లుండి శ్రీ శ్రీ కి ఎందుకు సహకరిస్తాడు? 24 గంటలు వార్తలు ప్రసారం చేసే ఒక చానల్ ఆఫీస్ లో రాత్రి పూటి సిబ్బంది ఎందుకు ఉండరు? ఇలా చెప్పుకొంటు పోతే లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సినిమాలో.. కానీ వాటన్నింటినీ “శ్రీ శ్రీ” పాత్రలో నటించిన కృష్ణ చరిష్మా మైమరపించింది. ఒక దర్శకుడిగా కథను సరిగా డీల్ చేయడంలో ముప్పాలనేని శివ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి, కానీ కృష్ణగారిని 10 ఏళ్ల తర్వాత వెండితెరపై పూర్తి స్థాయి కథానాయకుడిగా చూపించి ఆ లోటును భర్తీ చేసుకొన్నాడు.


విశ్లేషణ: 
నేటితరం ప్రేక్షకులకు “శ్రీ శ్రీ” సినిమా అస్సలు నచ్చకపోవచ్చు. ఆసక్తి లేని కథ, అలరించలేని కథనం అందుకు కారణాలుగా చెప్పొచ్చు. అయితే నిన్నటితరం సినిమా అభిమానులకు, సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానులను మాత్రం “శ్రీ శ్రీ” అలరిస్తుంది. కృష్ణ చరిస్మా, విజయనిర్మల డైలాగ్ డెలివరీ, నరేష్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కాగా క్లైమాక్స్ లో సుధీర్ బాబు గెస్ట్ రోల్, చివరిలో మహేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment