తాజా వార్తలు

Sunday, 12 June 2016

ముంపు బాధితులకు అండగా ఉందాం

రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం జీవో 123 ద్వారా చేపట్టిన భూసేకరణ వల్ల రైతులు నిలువనీడ లేకుండా రోడ్డునపడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం జరిగే వరకు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ తీరుతోపాటు పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పార్టీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. భూసేకరణ వల్ల తీవ్రంగా నష్టపోయే రైతులతో ఎక్కడికక్కడ సమావేశమై వారి గొంతును ప్రభుత్వానికి వినిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటికే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో రైతుల పక్షాన పోరాడి ప్రభుత్వంలో కదలిక తీసుకురాగలిగామని, మిగతా ప్రాంతాల్లోనూ రైతుల తరఫున పోరాడతామన్నారు. ఇందులో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో రైతులతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను దగా చేసిందని మల్లు రవి ఆరోపించారు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్...కేంద్రం ఆ పరిమితి పెంచినా హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం ఇంకా ప్రణాళిక రూపొందించలేదని విమర్శించారు.

 చేరికలపైనే కేసీఆర్ దృష్టి..

 సీఎం కేసీఆర్‌కు ప్రజాసమస్యలు పట్టవని, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించారని మల్లు రవి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ రెండేళ్లలో విపక్ష పార్టీలను బలహీనం చేయడం తప్ప ఒక్క ప్రజాప్రయోజన కార్యక్రమమూ చేపట్టలేదన్నారు. నిజాలు చెబితే జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్ నేతలు ప్రొఫెసర్ కోదండరాంపై మాటలదాడికి దిగారన్నారు. ప్రజాభిప్రాయాన్నే కోదండరాం వ్యక్తపరిచారని... అయినా టీఆర్‌ఎస్ ఎదురుదాడి చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మల్లు రవి విమర్శించారు.

ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 17న పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని కార్యవర్గ సమావేశం తీర్మానించినట్లు మల్లు రవి వెల్లడించారు. స్థానిక నేతలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ప్రజాసమస్యలపై పోరుకు వారిని సిద్ధం చేస్తామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతోపాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment