తాజా వార్తలు

Thursday, 23 June 2016

సీమ ప్రాజెక్టులకు అన్యాయం

కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సమావేశంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగునీటి ప్రాజెక్టులను మాట మాత్రంగానైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించకపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ ప్రాంత ప్రాజెక్టులు నాశనమైనా ఫర్వాలేదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. బోర్డు సమావేశానికి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రణాళికతో వెళితే ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఎలాంటి వ్యూహం లేకుండా వెళ్లారని విమర్శించారు.
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన జరిగిన వెంటనే అపెక్స్ కౌన్సిల్ కావాలని పట్టు పట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇపుడు ఆ విషయంలో సాగునీటి మంత్రి తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణకు అవసరానికన్నా ఎక్కువ నీరు వస్తున్నా ఇంకా ఎక్కువగా సాధించాలని హరీశ్ వెళ్లారని, మన మంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రాయలసీమ చుక్కనీరిచ్చారా?
తెలుగు ప్రజలకు వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెప్పించడంలోనూ కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే ఇపుడు పట్టిసీమ పేరుతో వృథాగా రూ 1,800 కోట్ల వ్యయంతో నాలుగు మోటార్లు బిగించి నదుల అనుసంధానం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమతో ఒక్క చుక్కనీటినైనా రాయలసీమకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పట్టిసీమ వల్ల తెలంగాణ తన వాటా కింద 40 టీఎంసీలు, పోలవరానికి  సంబంధించి మరో 45 టీఎంసీల నీటిని వాటాగా తీసుకునే పరిస్థితికి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment