తాజా వార్తలు

Friday, 10 June 2016

'ముద్రగడ కుమారుడిని కొట్టారు'

'పెడతామంటే వచ్చిన వాళ్లు కొడతామంటే ఒప్పుకోరని' ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, వాగ్దానాన్ని నిలుపుకోమని మాత్రమే కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.


శుక్రవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నిలుపుకోకుండా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ముద్రగడ కుమారుడిని పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని, ముద్రగడ సతీమణి పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా వ్యవహరించడం ధర్మమేనా అని నిలదీశారు.అధికార దుర్వినియోగంతో ఎంఎస్ ఓలను బెదిరించి సాక్షి, ఇతర చానళ్ల ప్రసారాలు నిలిపివేయించారని అన్నారు. ఎంఎస్ ఓలకు ఎస్పీలు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. అంతకుముందు ముద్రగడ దీక్ష చేస్తే మంత్రులు ఆయనకు వద్దకు వచ్చి చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

తుని ఘటన జరిగినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు శాంతికాముకులని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి వచ్చినవారే తునిలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోజు చంద్రబాబు, టీడీపీ మంత్రులు ఆరోపిస్తూ వైఎస్ జగన్ పై నెట్టివేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు గోదావరి జిల్లాల్లోని వారిని అరెస్ట్ చేస్తున్నారని సూటిగా నిలదీశారు. కాపుల్లో బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని అంబటి రాంబాబు అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment