తాజా వార్తలు

Thursday, 2 June 2016

దసరా నుంచి కొత్త జిల్లాలు…

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందన్నారు సీఎం కేసీఆర్‌. ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమంటూ పాలకులు అవమానిస్తుంటే భరించాల్సి వచ్చిందన్నారాయన. పసి పిల్లలకు పెట్టే తిండిని కూడా గ్రాముల లెక్కగట్టే దుర్మార్గపు పద్దతులుండేవన్నారు. ఈ ఏడాది నుంచి కాలేజీలు, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు కేసీఆర్‌.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు జాతీయ రహదారులు సాధించామన్నారు సీఎం కేసీఆర్‌. కేవలం రెండేళ్ల కాలంలో 19 వందల కిలో మీటర్ల రోడ్లు మంజూరయ్యాయని తెలిపారాయన. హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చివరి దశకు వచ్చిందన్నారు సీఎం. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు.
కారు చీకట్లు తొలిగిపోయి… వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. రాబోయే మూడేళ్లలో 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేసీఆర్ చెప్పారు.

దసరా నుంచే కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం కేసీఆర్. భౌగోళిక సామీప్యం, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా కసరత్తు జరుగుతోందని… దాదాపు 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment