తాజా వార్తలు

Wednesday, 22 June 2016

మల్లన్న సాగర్ పై రాజకీయాలు సరికాదు

మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడి అడ్డుకోవాలని చూస్తున్నారు. రైతుల కోరిక మేరకు భూసేకరణ చట్టం-2013 ప్రకారమే పరిహారం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఏపీ లాక్కుంటే ఎవరూ మాట్లాడలేదు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టును అడ్డుకుంటూ రాజకీయం చేయడం మంచిది కాదు.’ అని అన్నారు.
తుది ఘట్టానికి ‘మహా’ ఒప్పందం! మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నేడు మంత్రి హరీశ్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కాశేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించే మేడిగడ్డ, తమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణాలపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. బ్యారేజీ నిర్మాణాలపై అధికారుల స్థాయిలో జరగాల్సిన చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా, ఒప్పంద ప్రక్రియను తెలంగాణ వేగిరం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉన్న నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు, అక్కడే ఉన్న మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీశ్ మహాజన్‌తో మాట్లాడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.
గురువారం ఢిల్లీ నుంచి హరీశ్‌రావు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఫడ్నవిస్‌తో బ్యారేజీ ఎత్తుపై తుది ఆమోదం తీసుకొని ఒప్పంద తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత విషయమై హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. తమ ప్రాంతంలో ఎలాంటి ముంపు లేనందున తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుకు సమ్మతం తెలిపింది. రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో మహారాష్ట్ర మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుకు ఓకే అని, జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దానికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్ల నుంచి వివిధ ఎత్తులో ఉండే ముంపును తేల్చారు.
102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టార్లు, 101.5 మీటర్ల ఎత్తులో 310 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని తెలంగాణ అధికారులు కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రుల స్థాయిలో నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ ఎత్తుపై మహారాష్ట్రను ఒప్పంచడంతో పాటు ఒప్పందాల తేదీ ఖరారు చేయడమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు చర్చలు జరుపుతారని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment