తాజా వార్తలు

Wednesday, 8 June 2016

రెండేళ్లలో ఎవరికీ సంతృప్తి కలగలేదు: బొత్స

చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాటు సాగించిన పాలనలో ఏ ఒక్క వర్గానికీ సంతృప్తి కలగలేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించాలని కోరుతున్నామన్నారు. మేధావులు కూడా దీనిపై ఆలోచించాలన్నారు. ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తమకు ఏమైనా అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని సామాన్యులు ఆశిస్తారని.. అలాగే మేధావులైతే పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని, రాష్ట్రం పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని అనుకుంటారని ఆయన అన్నారు.

కానీ దురదృష్టం ఏమిటంటే, ఈ రెండేళ్లు ఏ ప్రాంతానికీ, ఏ వర్గానికి ఎటువంటి సంతృప్తి ఇవ్వకుండా అందరిలోనూ దయనీయమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించే సీఎం ప్రజలకు ఒక భరోసా ఇవ్వగలగాలని, కానీ రెండేళ్లలో ఎవరికీ సంతృప్తి ఇవ్వకుండా పాలన సాగిందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. అవి...

1) వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు!
వ్యవసాయం రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మీరు అధికారంలోకి రాక ముందు వ్యవసాయ రుణాలెన్ని? మీ రెండేళ్ళ పాలన తరువాత రైతులు బ్యాంకులకు కట్టాల్సిన వ్యవసాయ రుణాలెన్ని? మీరు అధికారంలోకి రాక ముందు బ్యాంకుల నుంచి రైతులకు గత పదేళ్ళుగా అందిన వ్యవసాయ రుణాలెంత? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా రైతులకు అందిన వ్యవసాయ రునాలు ఎంత ? అధికారంలోకి వచ్చే సరికి రూ. 87, 612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాల విషయాన్ని మరిచి ఇప్పటి వరకు కనీసం రూ. 9 వేల కోట్లు కూడా బడ్జెట్‌లో కేటాయించకపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ వాగ్దానాల్ని నమ్మి రుణాలు చెల్లించని రైతులు అపరాధ వడ్డీలుగా ఏకంగా రూ. 30వేల కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నది నిజం కాదా?

2) డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు
డ్వాక్రా రుణాలన్నీ ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? మీరు అధికారంలోకి వచ్చేసరికి ఏ గ్రేడ్‌ ద్వారా సంఘాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు రెండేళ్ళ తరువాత మీ హయాంలో ఏ గ్రేడ్‌ డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి?

3) ఇంటికో ఉద్యోగం.. లేదా రూ. 2వేలు నిరుద్యోగ భృతి అన్నారు
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరికి నిరుద్యోగ భృతి ఇచ్చారు?

4) ప్రత్యేక హోదా అనే మహా సంకల్పం ఏమయింది?
ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీ అంటే, కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని మీరు అన్నారు. ఎన్నేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చారు? ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టలేదంటూ మీరే దొంగ సాకులు వెతుకుతున్నారు. మీరు స్వయంగా వాగ్దానం చేసి మీ మేనిఫెస్టోలో పెట్టిన వందల కొద్దీ వాగ్దాలకు ఇప్పుడు పడుతున్న గతి ఏమిటి?

5) పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పూర్తి చేస్తాం అన్నారు
ఇప్పటికి రెండేళ్లు అయింది. ఎప్పటికి పూర్తి చేయిస్తారు? జాతీయ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా? మీ ప్రభుత్వానిదా?

6) బడ్జెట్‌లో ఇవ్వాల్సిన అంకెల్లో, నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్‌ ఎస్టిమేట్లు కూడా ఇవ్వకపోవడం ద్వారా ఆదాయ వ్యయాలను దాచిపెట్టింది నిజం కాదా? మీరు చెబుతున్న ఏపీ ఆర్థిక వృద్ధిరేటు బోగస్‌ అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం నిజం కాదా?

7) సీబీఐ విచారణలంటే ఎందుకంత భయం?
వైఎస్సార్‌ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతగా వోక్స్‌ వాగన్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, పరిటాల రవి హత్య వంటి అంశాల్లో మీరు సీబీఐ విచారణ కోరగానే ఆయన ప్రభుత్వం అంగీకరించింది. ఆ విచారణ జరగడం వల్ల ఔటర్‌ రింగురోడ్డు ఆగిపోలేదు. ఎయిర్‌ పోర్టు ఆగలేదు. పీపీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే ఆగలేదు. మరి రాజధాని భూములు, అమరేశ్వరుడి భూమలు, పట్టిసీమ, పారిశ్రామిక రాయితీలు, భూ కేటాయింపులు తదితర అంశాల్లో జరిగిన అవినీతిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తుంటే మీరు ఎందుకు కుదరదని భీష్మించుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో సూట్‌కేసుగా ముద్రపడిన మీ తనయుడు లోకేశ్‌ పాత్ర, అవినీతి పర్సెంటేజీల గురించి విచారణకు సిద్ధపడతారా?

8) రెండేళ్ల పాలన పీడ కల కాదా?
మీరు ఈ రెండేళ్లలో ప్రజల మనసు గెలుచుకునే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేకపోయారు కాబట్టే, మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేకపోబట్టే, వందల కొద్దీ శుష్క వాగ్దానాలూ.. వేల కొద్దీ అరాచకాలు చేశారు. కాబట్టే.. ప్రజల మనసు గెలుచుకుని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రూ 30 కోట్లు నుంచి రూ. 40 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం నిజం కాదా?

9) శాసనసభ గౌరవాన్ని దిగజార్చడం నిజం కాదా?
పార్టీ కండువాలు మార్చి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అయినా వారిని డిస్‌క్వాలిఫై చేయకుండా.. విప్‌ జారీకి కూడా అవకాశం ప్రతపక్షానికి లేకుండా.. చివరికి ఎప్రాప్రియేషన్‌ బిల్లుమీద డివిజన్‌ ఓటింగ్‌ రాజ్యాంగబద్ధం అని తెలిసి కూడా దాన్నీ కాదనడం ద్వారా.. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పదిమందితో తిట్టించే కార్యక్రమానికి, నిలదీస్తే బహిష్కరించే ధోరణికి అంటు కట్టి శాసన సభ గౌరవాన్ని దిగజార్చడం నిజం కాదా?

10) తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలులో తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కోట్లు ఇస్తూ దొరికిపోయినప్పుడు ఆడియోలో వాయిస్‌ మీది అవునా కాదా? దొరికిపోయిన మిమ్మల్ని ముఖ్యమంత్రిగా భరించాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు శిక్ష కాదా?
మీరు దొరికిపోయి ఏడాది అయినా మిమ్మల్ని కేసీఆర్‌ ప్రభుత్వం చార్జి షీట్‌లో నిందితుడిగా పేర్కొనలేదంటే.. మిమ్మల్ని కనీసం విచారణకు కూడా పిలువ లేదంటే.. మీరు ఏపీ ప్రయోజనాలతో పాటు కృష్ణా గోదావరి నదుల్ని తెలంగాణ ప్రభుత్వానికి , ఈ అంశం మీద సీబీఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారన్నది నిజం కాదా?
« PREV
NEXT »

No comments

Post a Comment