తాజా వార్తలు

Friday, 10 June 2016

“ఒక్క అమ్మాయి తప్ప” రివ్యూ…

కథ:
కృష్ణవచన్ (సందీప్ కిషన్) చాలా తెలివైన అబ్బాయి. చిన్నప్పుడే మ్యాంగో (నిత్యమీనన్) అనే అమ్మాయికి ఐలవ్యూ అని చెప్తాడు. అదే అమ్మాయిని పెద్దయ్యాక హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీద కలుసుకుంటాడు. మొదటి వీరిద్దరి మధ్య గొడవ జరిగినా… తాము చిన్నప్పుడు విడిపోయిన స్నేహితులుగా గుర్తిస్తారు. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోరు. కృష్ణ ఆ అమ్మాయిని ఇష్టపడడం మొదలుపెడతాడు. ఇది ఇలా ఉండగా ఎన్ని గంటలు దాటుతున్నా… ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వకపోవడంతో ఎవరికీ ఏమి అర్ధం కాదు.

అన్వర్ (రవి కిషన్) అనే టెరరిస్ట్ కావాలనే ఫ్లై ఓవర్ మీద యాక్సిడెంట్ చేయించి బాంబు బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అయితే అన్వర్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో తను అనుకున్న పనిని కృష్ణ వచన్ తో చేయించాలని అనుకుంటాడు. కొన్ని పరిస్థితుల వల్ల కృష్ణ, అన్వర్ చెప్పిన విధంగా చేయాల్సివస్తుంది. అసలు కృష్ణ, అన్వర్ చేతుల్లో ఎందుకు బందీ అయ్యాడు..? ఫ్లై ఓవర్ మీద నిజంగానే బాంబు బ్లాస్ట్ అవుతుందా..? లేక కృష్ణ ఆ ఆపద నుండి అందరిని కాపాడగలిగాడా..? తను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోగలిగాడా..? అనే విషయాలతో సినిమా నడుస్తుంటుంది.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో కృష్ణ వచన్ గా సందీప్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేశాడు. సినిమా మొత్తం తానై నడిపించాడు. కాని కొన్ని చోట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయినట్లు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. టెరరిస్ట్ చెప్పిన పనులను చేయలేక స్ట్రగుల్ అవుతున్న పాత్రలో చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో కూడా తన నటనతో అలరించాడు.

ఈ సినిమాలో నిత్య మీనన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదనే చెప్పాలి. కానీ ఉన్నంతలో తన సహజ నటనను కనబరిచింది. విలన్ అన్వర్ గా నటించిన రవి కిషన్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. హీరోని మైండ్ గేమ్‌తో ఆడుకునే అన్వర్ పాత్రలో రవికిషన్ పర్వాలేదనిపించాడు. కమెడియన్స్ ఆలి, సప్తగిరి, తాగుబోతు రమేష్, థర్టీ ఇయర్స్ పృధ్వి ట్రాఫిక్ జామ్ లో నవ్వించడానికి ప్రయత్నించారు. కాని పెద్దగా వర్కవుట్ కాలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
రచయితగా ఎప్పుడో ఏడేళ్ల క్రితం రాసుకున్న కథను సినిమాగా తెరకెక్కించాడు రాజసింహ. కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అంటే చోట కె నాయుడు కెమెరా అనే చెప్పాలి. ఒకే లొకేషన్ లో సుమారుగా ఎనభై శాతం సినిమా చూపించడమంటే మామూలు విషయం కాదు. ప్రేక్షకులు విసిగిపోతారు. కానీ అలాంటి ఫీలింగ్ కలిగించకుండా తన కెమెరాతో మ్యాజిక్ చేశాడు చోట కె నాయుడు. ఈ సినిమాకు పాటలతో పెద్దగా పని లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. అది సినిమాలో చాలా బావుంది. నిర్మాతలు అనుకున్న బడ్జెట్ లో సినిమా చేయడంలో సక్సెస్ అయ్యారు. కథను నడిపించడానికి అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టారనిపిస్తుంది. సినిమా మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉండాల్సింది.

విశ్లేషణ:
పోలీసుల దగ్గర ఉన్న ఓ టెరరిస్ట్ ను విడిపించడానికి, ఫ్లై ఓవర్ మీద బాంబు బ్లాస్ట్ చేయాలనుకోవడం, ఆ పని చేయడానికి హీరోను ఎన్నుకోవడం ఇలా ఆసక్తికరంగా మంచి కథనే రాసుకున్నాడు రాజసింహ. అయితే దానికి తగ్గ కథనం రాసుకోలేదనే చెప్పాలి. లాజిక్ కు అందకుండా కథను చక్కగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ల పరిచయాలతో నడిపించేసి, సెకండ్ హాఫ్ లో కథలోకి ఎంటర్ అవుతాడు. సినిమా బావుందే అనుకునేలోపే కామెడీ సన్నివేశాలు పెట్టి బోర్ కొట్టించేసాడు. కొన్ని యాంగిల్స్ లో బాలీవుడ్ లో కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘ఏ వెడ్ నెస్ డే’ సినిమాను గుర్తుకు తెస్తుంది. లవ్ స్టోరీ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. కామెడీ కూడా సో.. సో.. గా ఉండడం వలన తను అనుకున్న టార్గెట్ ను అయితే రాజసింహ రీచ్ కాలేదనే చెప్పాలి.

మొత్తానికి… “మీకు ఓపికుంటే తప్ప” చూడకూడని సినిమా “ఒక్క అమ్మాయి తప్ప”
« PREV
NEXT »

No comments

Post a Comment