తాజా వార్తలు

Saturday, 25 June 2016

‘ఒక మనసు’ రివ్యూ…

కథ:
సంధ్య (నిహారిక కొణిదెల) ఓ డాక్టర్. తాను ప్రేమించిన సూర్య (నాగశౌర్య)ను పెళ్ళాడి అతడితో జీవితం పంచుకోవాలని ఆశపడుతుంది. కానీ ఓ సెటిల్ మెంట్ కారణంగా మూడేళ్లు జైల్లో ఉండిపోతాడు సూర్య. ఆ జైలు శిక్ష సూర్య జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. ఆఖరికి తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న సంధ్యను వాదులుకోవాల్సి వస్తుంది. అసలు సూర్య జైల్ కి ఎందుకు వెళ్ళాడు? సంధ్యను ఎందుకు వాదులుకోవాల్సి వచ్చింది? చివరికి వీరి ప్రేమగాధ ఏ తీరానికి చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఒక మనసు”.

నటీనటుల పనితీరు:
సంధ్య పాత్రలో నిహారిక పరిణితి చెందిన నటన కనబరిచింది. రొమాంటిక్ సీన్స్ లో మాత్రం కాస్త రెచ్చిపోయిందనిపిస్తుంది. సినిమా మొత్తంగా హీరో నాగశౌర్యకు కనీసం ఒక వంద ముద్దులు పెట్టి ఉంటుంది. రాజకీయ నాయకుడు కావాలని కలలుగనే సూర్య పాత్రలో నాగశౌర్య చక్కని నటన కనబరిచాడు. తన మునుపటి సినిమాల్లో కంటే సెటిల్డ్ గా నటించాడు. తండ్రి పాత్రలో ఎప్పట్లానే రావురమేష్ తనదైన శైలిలో పాత్రను పండించాడు. తల్లి ప్రగతి పెర్ఫార్మెన్స్ బాలేదు. బాధ్యత కంటే బాధనే ఎక్కువగా ప్రదర్శించింది. నెగిటివ్ క్యారెక్టర్ పోషించాలని హేమంత్, కాస్త నవ్వించడానికి వెన్నల కిషోర్ లు పడిన శ్రమ వృధా అయ్యింది. శ్రీనివాస్ అవసరాల పాత్రకు తగ్గ నటన కనబరిచాడు.

సాంకేతికవర్గం పనితీరు:
సునీల్ కశ్యప్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అయితే చిత్రీకరణ వల్ల వింటున్నప్పుడు కలిగిన అనుభూతి చూస్తున్నప్పుడు ఆస్వాదించలేము. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. అయితే సినిమా మొత్తం దాదాపుగా “ఎల్లో కలర్” టింట్ వాడడం వల్ల ఎమోషనల్ సీన్స్ సరిగా పండలేదు. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ మరీ నత్తనడకలా సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రామరాజు దివంగత రచయిత చలం శైలిని తన సినిమాకి అద్దిన తీరు బాగుంది. హీరోయిన్ ను పేరు పెట్టి పిలవకుండా హీరో చేత ‘అమ్మాయ్’ అని పిలిపించడం చూడముచ్చటగా, వినసొంపుగా ఉంటుంది. అయితే ‘ఒక మనసు’ కూడా ఆయన మునుపటి సినిమా ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వలె బాగా సాగినట్లుగా ఉండడంతో అసలే కథ లేదు అని ప్రేక్షకుడు సీట్ లో చాలా ఇబ్బందిగా కదిలే ప్రేక్షకుడ్ని నత్త నడకలా సాగిన కథనం ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సాధారణ ప్రేమకథను ‘మరో చరిత్ర’ లాంటి చిత్రరాజంతో కంపేర్ చేయాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో ఆయనకే తెలియాలి.

మొత్తానికి..
ఎంత క్లాస్ సినిమా అయినా థియేటర్ లో ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టినప్పుడే విజయం వారిస్తుంది కానీ ఇది “క్లాస్ సినిమా, ఇలాగే ఉంటుంది” అని ప్రేక్షకుడ్ని మభ్యపెట్టాలనుకోవడం సమంజసం కాదు. ‘శంకరాభరణం’, ‘రుద్రవీణ’ వంటి సినిమాలు కూడా క్లాసే కానీ చాలా అంశాల మేళవింపుగా కథ నడుస్తుంది. అందుకే ఆ సినిమాలు అన్నీ వర్గాల వారిని అలరించాయి. రామరాజు కూడా కథ రాసుకొనేప్పుడు కేవలం హీరోహీరోయిన్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రేక్షకుడి గురించి కూడా ఆలోచించి ఉంటే ‘ఒక మనసు’ రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో!

ఫైనల్ గా చెప్పాలంటే..
మనసుపెట్టి చూడలేని సినిమా ‘ఒక మనసు’…
« PREV
NEXT »

No comments

Post a Comment