తాజా వార్తలు

Friday, 10 June 2016

రాహుల్ బాబాకు ఇటాలియన్ కళ్లద్దాలు

రాహుల్ బాబాకు ఇటాలియన్ కళ్లద్దాలు ఉన్నాయని, అందుకే ఆయనకు వాస్తవాలు ఏవీ కనిపించడం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన 'వికాస్ పర్వ్' సభలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ వాసులకు కోటి కోటి నమస్కారాలు తెలిపారు. ఈ రెండేళ్లలో దేశానికి ఏమిచ్చారని సోనియాగాంధీ ప్రశ్నించారని.. మరి మీ కుటుంబం 60 ఏళ్లలో దేశానికి ఏమిచ్చిందో దేశ ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


 • మేం మాట్లాడే ప్రధానమంత్రిని దేశానికి ఇచ్చాం.
 • మీ ప్రధానమంత్రి గొంతు మీకు, మీ అబ్బాయికి తప్ప దేశంలో వేరే ఎవరికీ వినిపించేది కాదు
 • మా ప్రభుత్వం మీద రెండేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా మీరు సైతం చేయలేకపోయారు
 • కానీ మీ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడి దేశ ఖజానాను లూటీ చేశారు
 • కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతరిక్షం నుంచి సముద్ర అంతర్భాగం వరకు ప్రతిచోటా కుంభకోణాలకు పాల్పడ్డారు
 • రాహుల్ బాబా తెలుసు కదా.. సరిహద్దుల్లో అప్పుడు, ఇప్పుడు కూడా కాల్పులు జరుగుతున్నాయి.. తేడా ఏముందని అడుగుతున్నారు
 • ఆయన కళ్లకు ఇటాలియన్ కళ్లద్దాలు ఉన్నాయి. అందుకే తేడా తెలియట్లేదు
 • ఇంతకుముందు పాకిస్థాన్ సైన్యమే కాల్పులు మొదలుపెట్టేది, అదే ముగించేది
 • కానీ ఇప్పుడు పాక్ ప్రారంభించినా, మన సైన్యం కాల్పులు ముగిస్తోంది
 • వాళ్లు బుల్లెట్లతో ప్రారంభిస్తే.. మనం ట్యాంకులతో సమాధానం ఇస్తున్నాం
 • ఈ మార్పు రాహుల్ గాంధీకి ఎందుకు తెలియడం లేదంటే.. ఆయన కళ్లకు ఇటాలియన్ అద్దాలున్నాయి
 • రెండేళ్లలో దేశ ఆర్థిక స్థితిని పట్టాలమీదకు తెచ్చింది బీజేపీ ప్రభుత్వమే
 • 7.9 శాతం వృద్ధిరేటు సాధించాం.. చైనాను కూడా ఈ విషయంలో అధిగమించాం
 • స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి పథకాలతో లక్షలాది మంది పేదలకు ఉద్యోగావకాశాలు కల్పించినది మోదీ సర్కారే
 • ఒక్క సంవత్సరంలోనే 3.84 కోట్ల మంది నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున రుణ దుపాయం కల్పించాం
 • పేదరికాన్ని పారద్రోలడానికి 22 కోట్లకు పైగా జనధన యోజన అకౌంట్లను తెరిపించాం
 • అమెరికా పార్లమెంటులో నరేంద్రమోదీకి లభించిన స్వాగతం మోదీకి వచ్చింది కాదు, బీజేపీది కాదు.. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలకు లభించిన స్వాగతం
 • మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు కూడా మౌనంగా ఉండి, రెండు కాగితాల్లో రాసిన ప్రసంగాన్ని చదివేవారు.
 • మలేసియాలో మాట్లాడాల్సింది థాయ్‌లాండ్ లోను, అక్కడ మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడేవారు
 • మోదీ మాత్రం అలా కాదు.. అక్కడికక్కడ మాట్లాడతారు
 • ఈ రెండేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 90 వేల కోట్ల నిధులు ఇచ్చింది
 • ఎవరైనా అడిగినా.. అందులో ప్రతి పైసాకు లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను
 • తెలంగాణను దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని ఆకాంక్షిస్తున్నాం
 • కుటుంబపాలన ఉన్న పార్టీల వల్ల దేశానికి, రాష్ట్రాలకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగదు. అధికార పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే తెలంగాణ కూడా అభివృద్ధి చెందదు
 • తెలంగాణలో ప్రతి గ్రామంలో 24 గంటలు కరెంటు ఉంటుందా? ప్రతి గ్రామానికీ రోడ్లు నిర్మించారా?
 • ప్రతి గ్రామంలో ఆస్పత్రులు ఉన్నాయా.. అవి పనిచేస్తున్నాయా
 • ప్రతి పంటకు నీళ్లు అందుతున్నాయా?
 • బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్.. అన్నిచోట్లా ఇవన్నీ ఉన్నాయి
 • అందుకే అక్కడి ప్రజలు ప్రతిసారీ బీజేపీని ఎన్నుకుంటున్నారు
 • 21వ శతాబ్దంలో కూడా నల్లగొండ వాసులకు ఫ్లోరైడ్ లేని నీళ్లు అందడం లేదు
 • 35 ఏళ్ల యువకుడు కూడా ముసలి రూపం వచ్చేస్తుంటే.. గుండె మండిపోతోంది
 • ఒవైసీ నేతృత్వంలో సాగుతున్న మత మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడగల సామర్థ్యం కేసీఆర్ సర్కారుకు లేదు.. బీజేపీకి మాత్రమే ఉంది
 • తెలంగాణ ప్రజలకు విన్నవించేది ఒకటే.. తెలంగాణ సమగ్రాభివృద్ధి, బంగారు తెలంగాణ బీజేపీ కార్యకర్తల వల్లే సాధ్యం
 • తెలంగాణ బలంగా ఉండాలి.. బీజేపీ బలంగా ఉండాలి
 • మోదీ చేతులను మీరు బలోపేతం చేస్తారా, బీజేపీని బలోపేతం చేస్తారా
 • మార్పు దిశగా పయనించాలంటే రెండు చేతులూ పైకెత్తి చెప్పండి.. భారత్ మాతాకీ జై, వందే మాతరం
« PREV
NEXT »

No comments

Post a Comment