తాజా వార్తలు

Sunday, 12 June 2016

రాజ్యసభలో కాస్త పెరిగిన బీజేపీ బలం…

సంఖ్యాబలం లేకపోవడంతో కీలక బిల్లులు ఆమోదించుకోలేకపోతున్న కమలానికి తాజా రాజ్యసభ ఎన్నికలు కాస్త ఊపిరి పోశాయి. ఇప్పటికీ పెద్దపార్టీ కాంగ్రెసే అయినా… మిత్రపక్షాల మద్దతుతో ఎలాగోలా నెట్టుకొచ్చేయని బీజేపీ భావిస్తోంది.

రాజ్యసభకు నిర్వహించిన ద్వైపాక్షిక ఎన్నికలు బీజేపీకి కాస్త ఊరట కలిగించాయి. రాజస్థాన్‌లోని నాలుగు స్థానాలను కమలం తన ఖాతాలో వేసుకుంది. కేంద్రమంత్రి వెంకయ్య ఇక్కడినుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… సమాజ్‌వాదీ పార్టీ ఏడు, బీఎస్పీ రెండు, కాంగ్రెస్‌, బీజేపీ చెరొకటి గెలుచుకున్నాయి.
కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ హర్యానాలో గెలుపొందారు. అయితే ఇక్కడ రెండో స్థానం నుంచి బీజేపీ మద్దతుతో సుభాష్‌చంద్ర ఎన్నికవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 14మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక JDS ఎమ్మెల్యేల క్రాస్‌ఓటింగ్‌తో కర్ణాటకలో కాంగ్రెస్‌ హవా నడిచింది.

రాజ్యసభలో మొత్తం 58 సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో 31 ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ బలం 49 నుంచి 54కి పెరిగింది. కాంగ్రెస్‌ బలం 64 నుంచి 58కు తగ్గిపోయింది. అయినా ఇప్పటికీ రాజ్యసభలో పెద్దపార్టీ కాంగ్రెస్సే… ప్రస్తుతం సభలో ఎన్డీయే మొత్తం బలం 72… సాధారణ మెజారిటీకి 123కి ఆ పార్టీ ఇంకా చాలా దూరంలోనే ఉంది. అయితే బీజేపీతో కాస్త స్నేహంగానే ఉంటున్న అన్నాడీఎంకే, బీజేడీల వంటి పార్టీలను కలుపుకుంటే ఇది 106కి చేరుతుంది.

లోక్‌సభలో తిరుగులేని బలమున్న బీజేపీ… రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షం కాంగ్రెస్‌ మద్దతు లేనిదే ఆర్థిక బిల్లులు కూడా గట్టెక్కని పరిస్థితి. జీఎస్‌టీ సహా పలు కీలక బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీఎస్‌టీని ఎలాగైనా ఈ వర్షాకాల సమావేశాల్లో అమోదింపచేసుకోవాలన్నది బీజేపీ ఆలోచన.

అయితే ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో దీనికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అంటే కనీసం 165 ఓట్లు కావాలి. జయలలిత, నవీన్‌పట్నాయక్‌తో పాటు మమతాబెనర్జీ కూడా కలసి వస్తే ఎలాగోలా ముందుకెళ్లొచ్చని కమలం భావిస్తోంది. జీఎస్‌టీకి మమత షరతులతో కూడిన మద్దతు ప్రకటించారు. అంటే సభలో గండం గట్టెక్కాలంటే మమత, జయలలితల డిమాండ్లను బీజేపీ తీర్చాల్సిందే… వారు చెప్పినట్లు చేయాల్సిందే…
« PREV
NEXT »

No comments

Post a Comment