తాజా వార్తలు

Saturday, 25 June 2016

“రమణ్ రాఘవ్ 2.0” రివ్యూ!

కథ: 
రమణ్ (నవాజుద్దీన్ సిద్దికి) ముంబై నగర మురికివాడల్లో బ్రతికే ఓ భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఒక మనిషిని చంపడానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. మనిషి నచ్చితే చాలు వెంటపడి, మాటువేసి వారిని దారుణంగా చంపేస్తాడు. అసలు ఎందుకు చంపుతాడు? అనే విషయం ఎవరికీ అర్ధం కాదు. ఆ కేసును డీల్ చేయమని రాఘవ్ (విక్కీ కౌషల్) కి అప్పగిస్తారు. రాఘవ్ కూడా దాదాపుగా రమణ్ లాంటి మనస్తత్వం కలిగినవాడే. రమణ్ అవతలివారిని చంపి పైశాచికానందం పొందుతుంటే.. రాఘవ్ డ్రగ్స్ వాడుతూ, తన గర్ల్ ఫ్రెండ్ ను లైంగికంగా వేధించి తన సాడిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే “రమణ్ రాఘవ్ 2.0”. 
 
విశ్లేషణ: 
అప్పట్లో రమణ్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడో, అతని బిహేవియర్ ఎలా ఉండేదో తెలియనివారు.. నవాజుద్దీన్ ను చూశాక “రమణ్” ఇలాగే ఉండేవాడేమో అని ఫిక్సయిపోతారు. ఓ సైకిక్ కిల్లర్ గా నవాజుద్దీన్ జీవించాడని చెప్పడం చాలా చిన్న పదం, మనుషులను చంపుతూ వారితో మాట్లాడే శైలి మొదలుకొని.. వారు చనిపోతున్నప్పుడు వారిని చూస్తూ మనసులో సంతోషపడే సన్నివేశాల్లో నవాజుద్దీన్ నటన ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించడం ఖాయం. 
రాఘవ్ అనే టిపికల్ పోలీస్ పాత్రలో విక్కీ కౌషల్ నటన మనకి “దండుపాళ్యం” సినిమాలోని పాత్రధారులను తలపిస్తుంది. ఎప్పుడెలా బిహేవ్ చేస్తాడో అతడికే అర్ధం కాదు. అయితే.. ఒక మనిషిలోని సాడిజాన్ని వెండితెరపై ప్రెజంట్ చేయడంలో మాత్రం అతనికి సాటి లేరు అనిపించుకొన్నాడు. 
ఇక మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఈ చిత్రంలో అందాల ప్రదర్శనతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకొంది. ప్రేమించిన వ్యక్తి పెట్టే చిత్రహింసలను భరిస్తూ అతడి ప్రేమ కోసం ఆరాటపడే ఆధునిక యువతిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. 
వీళ్ళందరికంటే.. చనిపోయేవారు చూపే హావభావాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతోపాటు ప్రేక్షకుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తాయి. 
 
రామ్ సంపత్ సంగీతం ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. జై ఫోటోగ్రఫీ కూడా బాగుంది. నైట్ షాట్స్ కు వాడిన లైటింగ్, మర్డర్ సీన్స్ కు వాడిన గ్రే టింట్, క్లోజప్ షాట్స్ కూడా బాగున్నాయి. 
ఎడిటింగ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి కానీ.. ఇంకాస్త క్లారిటీ ఉంటే బాగుండేది. ఛేజింగ్ సీన్స్, రన్నింగ్ సీన్స్ కు వాడిన ఫ్లో కామ్ ఎఫెక్ట్ కూడా సినిమాలో ప్లస్ పాయింట్ గా పేర్కొనవచ్చు. 
 
ఈ సినిమాకి మైనస్ పాయింటల్లా దర్శకుడి కథనం. వరుసగా మర్డర్లు, ఛేజింగ్ సీన్స్ తప్ప కథ పెద్దగా ఉన్నట్లు ఏమీ అనిపించదు. ఇక కథనం మరీ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడిగా అనురాగ్ ఈ చిత్రంలో ఫెయిల్ అయ్యాడు. రెండు గంటల ఇరవై నిమిషాల పాటు ప్రేక్షకుడ్ని థియేటర్ లో కూర్చోబెట్టలేకపోయాడు. 
హింసాత్మక సన్నివేశాలు కూడా మరీ ఎక్కువగా జొప్పించాడు. అందువల్ల రెగ్యులర్ సినిమా లవర్స్ కి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే.. హింసాత్మక సన్నివేశాలను ఎంజాయ్ చేసే కఠినమైన మనసున్నవారి కోసం మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఉంటుంది. 
 
మొత్తానికి.. 
నవాజుద్దీన్ ఫ్యాన్స్ మాత్రమే చూడదగ్గ చిత్రం “రమణ్ రాఘవ్ 2.0”
« PREV
NEXT »

No comments

Post a Comment