తాజా వార్తలు

Sunday, 26 June 2016

ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటాం

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వం కమీషన్లు దండుకుంటోందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. భూమినే నమ్ముకొని బతుకెళ్లదీస్తున్న రైతులను నిరాశ్రయులను చేసేందు కు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లా తొగుట మండ లం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితులకు మద్దతుగా చేపట్టిన 48 గంటల దీక్ష ఆదివారం సాయంత్రం ముగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముంపు బాధితులు కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
తాను చేపట్టిన దీక్ష తో ప్రభుత్వంలో కొంత మేరకు చలనం వచ్చిందన్నారు. ముంపు బాధితుల ఆక్రందనలకు చలించి తాను దీక్ష చేపట్టాల్సి వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే బతుకులు మారుతాయని భావించిన ప్రజలను బజారున పడేయడమా? అని ప్రశ్నించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల పేరుతో ప్రజలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజలు ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎదిరించాలన్నారు. సమైక్య రాష్ట్ర సీఎంలు సైతం ప్రజలపై ఇంత మూర్ఖంగా వ్యవహరించలేదన్నారు. ముంపు గ్రామాల ప్రజల గోడు వినే తీరిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలకు లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ నేతలు జెండాలు, కండువాలు పక్కనపెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామానికి చెందిన వంగ గాలవ్వ నిమ్మరసం ఇచ్చి రేవంత్‌రెడ్డి దీక్షను విరమింపజేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment