తాజా వార్తలు

Thursday, 30 June 2016

రొటీనా..రాజకీయమా?

జగన్ కు సంబంధించిన 749 కోట్ల రూపాయిల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అటాచ్ చేసింది. ఈ మధ్య కాలంలో ఆస్తుల అటాచ్మెంట్ జోలికి పోని ఈడీ ఉన్నట్టుండి ఇంత పెద్దమొత్తం ఆస్తులను అటాచ్ చేయడం రొటీన్ దర్యాప్తులో భాగమా లేక, తెరవెనుక మరే రాజకీయం అయినా మళ్లీ పురుడు పోసుకుంటోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో మోడీ వైఖరి కానీ, ఆయన తెరవెనుక వుంటూ నడిపిస్తున్న రాజకీయాలు కూడా అంత సులువుగా అంతుపట్టేలా లేవు. 
రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ పై స్వామి మాటల దాడి..అంతా అయిపోయాక మోడీ ఆయింట్ మెంట్ పూసే ప్రయత్నం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక మన దగ్గరకు వస్తే, హైకోర్టు విభజన అంశం, దానిపై భాజపా కేంద్ర మంత్రి కామెంట్లు, కేసిఆర్ ను కేజ్రీవాల్ తో పోల్చడం వంటివి వున్నాయి. కాస్సేపు చంద్రబాబుతో విభేదించినట్లు కనిపించడం,  మరో వైపు వైకాపాను దగ్గర తీస్తున్నారనిపించడం ఇటీవల జరిగాయి.  ఓ దశలో కేంద్ర క్యాబినెట్ లోకి టీఆర్ఎస్ చేరుతుంది, తెలంగాణ క్యాబినెట్లో కూడా బీజేపీ చేరుతుంది అన్నంతగా ప్రచారం జరిగింది. 
అదే తరుణంలో ఏపీలో తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుంటుంది అన్నంత రీతిలో బీజేపీ వ్యవహరించింది. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లిన జగన్ కు పలువురు కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం, చంద్రబాబుపై, తెలుగుదేశం సర్కారు విధానాలపై ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం, వాటిపై కేంద్ర మంత్రులు స్పందించడం కూడా జరిగింది. జగన్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడంపై కూడా తెలుగుదేశం నేతలు బహిరంగంగానే విమర్శించారు. కానీ ఇప్పుడు బీజేపీ వ్యవహారం చూస్తే అది తన మనసును మళ్లీ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. 
మళ్లీ ఏపీలో భాజాపా మళ్లీ టీడీపీ పట్ల సానుకూలంగా ఉండడం మొదలుపెట్టింది. అదే క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ తో విభేదించడం మొదలుపెట్టింది. ఓరకంగా తెలంగాణలో టీఆర్ఎస్ పై రాజకీయ పోరాటాన్నే ప్రారంభించింది. ఒకరిపై ఒకరు విమర్శల దాడి పెంచుకున్నారు. హైకోర్టు విభజన, జలవివాదం వంటి వాటిలో తెలంగాణకు షాకిచ్చారు. అంటే మళ్లీ బీజేపీ తన ట్రెండ్ మార్చుకున్నదన్నది క్లియర్. ఇందులో భాగంగానే కేంద్రం జగన్ విషయంలో నిద్రావస్థలో ఉన్న ఈడీని తట్టి లేపి ప్రయోగించిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇలా సందేహించడానికి కూడా కారణాలు వినిపిస్తున్నాయి.   
సీబీఐ 2013 సెప్టెంబర్ చివర్లో 11వ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈడీ 8 చార్జిషీట్లపైనే స్పందించి ఆస్థులను అటాచ్ చేసింది. పైగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలోని ఆరోపణల ఆధారంగానే అవే తప్పులని నిర్ధారించి ఆస్థులను అటాచ్ చేస్తోంది తప్ప సొంతంగా సీబీఐ చార్జిషీట్లలోని ఆరోపణలను విచారించి అందులో ఎంత వాస్తవమో తనకు తాను నిర్ధారించుకోకుండానే సేమ్ టు సేమ్ సీబీఐ పేర్కొన్న వాటినే అటాచ్ చేస్తోంది. ఇఫ్పుడు కూడా అలాగే చేసిందని వైకాపా అంటోంది. 
అప్పటి నుంచీ సైలెంట్ గా వున్నా ఈడీ. ఒక్కసారి మిగిలిన చార్జిషీట్లు తీసి, మాగ్జిమమ్ అటాచ్ మెంట్లు చేసింది అంటే, మళ్లీ ప్రభుత్వం వైపు నుంచి సూచన ప్రాయమైన కదలిక ఏమన్నా వచ్చిందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇరుకున పడే ప్రత్యేక హోదా విషయంలో జగన్ పట్టుదలగా వున్నాడు. జగన్ ఈ విషయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తున్నా, అది వెళ్లి మోడీకే తగులుతోంది. పైగా పనిలో పనిగా వెంకయ్యకు కూడా.  మొత్తం మీద ఆంధ్రలో జగన్ దూకుడును తగ్గించడంలో భాగంగానైనా ఈ పనిచేసి ఉండాలి అన్న వాదనలయితే వినిపిస్తున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment