తాజా వార్తలు

Wednesday, 1 June 2016

కుట్రలు ఎదుర్కొనేందుకే పునరేకీకరణ

తెలంగాణ ఉద్యమాన్ని అస్థిరపర్చే యత్నం చేసిన తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకు కుట్రలు జరిగాయని.. వాటిని ఎదుర్కొనేందుకే రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో చేరికలు ఆషామాషీగా జరుగుతున్నవి కాదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగమని పేర్కొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకైక ఎంపీ, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు మల్లారెడ్డి బుధవారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.


ఈ సందర్భంగా మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు మంత్రులు, నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో కేసీఆర్ తన అనుభవాలను వివరిస్తూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా అనేక మందితో సంప్రదింపుల అనంతరం 2001లో ఒంటరిగా ప్రారంభించిన తన ప్రయాణంలో అనేక మంది తోడుగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మూడు నాలుగు వేల గంటలు చర్చలు జరిపామని, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

 నాలుగు రకాలుగా కుట్ర...
తెలంగాణ ఉద్యమం రాజకీయంగా ముందుకు సాగుతున్న క్రమంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఆంధ్రా శక్తులు పలు కుట్రలు చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు విభజించు-పాలించు విధానం, ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం, ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేయడం... అనే నాలుగు పద్ధతుల్లో కుట్రలు పన్నారని చెప్పారు. 2004 వరకు వెనుకంజ వేయకుండా ఉద్యమాన్ని కొనసాగించి.. కేంద్ర మంత్రి పదవి చేపట్టడం, జార్ఖండ్ ఉద్యమ కారుడు శిబుసోరెన్‌తో స్నేహం, 36 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ క్రమంలో తనపై వచ్చిన జోక్‌లనూ కేసీఆర్ ప్రస్తావించారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి ఆకాశమంత ఎత్తుకు లేపినా.. విఫలం కావడం వెనుక కారణాలను విశదీకరించారు.
ప్రజాకర్షక నేతగా ఇందిరాగాంధీ ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు, బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి 11 స్థానాలు గెలవడం తదితర అంశాలను ప్రస్తావించారు. అప్పటి సీపీఐ నాయకుడు డాంగే సలహా మేరకు తెలంగాణ ఏర్పాటుపై ఇందిరాగాంధీ విముఖత చూపారని.. చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడంలో ఆంధ్ర పత్రిక పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. 1969లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా ఉండేదని చెప్పారు. 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2లక్షల కోట్లకు, 2024-25 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు.

 బంగారు తెలంగాణ కోసమే..
రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని వీడడం బాధాకరమైనప్పటికీ బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితమై టీఆర్‌ఎస్‌లో చేరినట్టు మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే ఈ నిర్ణయమన్నారు. పార్టీ మారే విషయం కుటుంబ సభ్యులు, అనుచరులతో నాలుగైదు నెలలుగా మాట్లాడుతున్నానని, తిరుపతి మహానాడులో చంద్రబాబు సహా సన్నిహితులకు కూడా చెప్పానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. 

ఏకమై అభివృద్ధి చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అస్థిరపరిచే కుట్ర జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 83కు చేరుకోవడంతో రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment