తాజా వార్తలు

Friday, 3 June 2016

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నిరసన

ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు శుక్రవారం పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. విజయవాడలో జగన్ దిష్టిబొమ్మ దహనం సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుకు మంటలు అంటుకొని ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై రమేష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద 8వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి సిద్ధపడ్డారు. బొమ్మపై పెట్రోల్ పోసి అంటిస్తుండగా జాస్తికి కూడా మంటలంటుకున్నాయి.
ఆయన చేతులు, ముఖం, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. పోలీసులు, టీడీపీ కార్యకర్తలు మంటలార్పి సమీపంలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలోఅక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు రాంప్రసాద్, కృష్ణమోహన్‌లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారు.  పోలీసుల వల్లే తమ నాయకుడికి నిప్పంటుకుందంటూ టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై నాగేంద్రపై దాడికి పాల్పడ్డారు.

ఘటన నేపథ్యాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తున్న ఆయనపై టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. ఇతర పోలీసులు వారిని అడ్డుకొన్నారు. చిత్తూరులోని గాంధీ సర్కిల్ వద్ద టీడీపీ కార్యకర్తలు  జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక రాష్ట్రంలో జగన్‌ను ఎక్కడా పర్యటించకుండా చేస్తామని హెచ్చరించారు. టీడీపీలో 50 లక్షలకు పైగా కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్నారు.  అనంతపురం జిల్లాలో పలుచోట్ల టీడీపీ నాయకులు నిరసనలు తెలిపారు.  సీఎం చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా ప్రతిపక్ష నేత జగన్  ప్రసంగించారంటూ తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చిత్తూరు జిల్లా లీగల్ సెల్ నాయకుడు ఊటుపల్లి లక్ష్మన్న, ఉదయకుమార్‌రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రతిపక్షనేతపై కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల, చిలకలూరిపేట, అచ్చంపేటల్లో టీడీపీ నేతలు జగన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంగళగిరి, గుంటూరు పోలీస్‌స్టేషన్లలో జగన్‌పై ఫిర్యాదు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment