తాజా వార్తలు

Thursday, 2 June 2016

మరో కేఈని తయారు చేస్తా


‘బీసీలకు అన్యాయం జరుగుతోంది... అంటూ ఒక నాయకుడు బయలుదేరాడు. టీడీపీ అధిష్టానవర్గం బీసీ కోటాలోనే కేఈ కృష్ణమూర్తికి ఉపముఖ్యమంత్రి పదవిచ్చింది. మల్లెల రాజశేఖర్‌కు జిల్లా చైర్మన్ పదవి కట్టబెట్టింది. టీడీపీలో బీసీలకు ప్రాతినిథ్యం లేదనడం సరైనది కాదు. బీసీల్లో చాలా ఉప కులాలు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో అన్ని కులాలకు పదవులు లభిస్తేనే బీసీ కులాలు అభివృద్ధిలోకి వస్తాయి’ అని మాజీ మంత్రి,  రాజ్యసభ టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ వేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చి న సందర్భంగా పార్టీ శ్రేణులు, టీజీ అభిమానులు నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించా రు. కొండారెడ్డిబురుజు దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి పూజ నిర్వహించా రు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి రిటైరైతే జిల్లాలో మరో బీసీ నాయకుడిని ఆయన స్థానంలో తయారు చేసేందుకు టీజీ సిద్ధంగా ఉంటారని పరోక్షంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు తాను ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు. అన్ని కులాలకు తాను స్థలాలు కేటాయించి కులాలకు అతీతంగా కల్యాణ మంటపాలు కూడా కట్టించానన్నారు. పూలే విగ్రహం కూడా తానే ఏర్పాటు చేయించానని, కొంతమంది బీసీ నాయకులకు ఎంత చేసినప్పటికీ తృప్తి ఉండదన్నారు.

పారిశ్రామికవేత్త టీజీ తనయుడు టి.జి.భరత్, టీడీపీ క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్తలు కె.జె.రెడ్డి, విజయకుమార్‌రెడ్డి, లగిశెట్టి విశ్వనాథం, డాక్టర్ ఇస్మాయిల్, సిటీ కన్వీనర్ తిరుపాల్ బాబు, మాజీ మేయర్ బంగి అనంతయ్య, పలువురు మాజీ కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద నుంచి టాప్ లేని వాహనంలో టీజీని అనుచరులు ఊరేగించారు. పాతబస్టాండ్, పెద్ద మార్కెట్ మండిబజార్, వడ్డెగేరి, కిడ్స్‌వరల్డ్ వరకు ర్యాలీ సాగింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment