తాజా వార్తలు

Tuesday, 14 June 2016

సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు…

ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో 27.4 శాతం ఆదాయ వృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు ఆదాయం సమకూర్చే 10 ముఖ్య శాఖలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్‌ను కచ్చితమైన అంచనాలతో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పిన కేసీఆర్..

తెలంగాణ సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ ఏడాది 7,687 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. పారదర్శక విధానం, అవినీతి రహిత పద్ధతులు, సంస్కరణవల్లే ఈ అభివృద్ధి సాధ్యమైనట్లు కేసీఆర్ తెలిపారు.

2015 ఏప్రిల్, మే నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్‌పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా ఖజానాకు రూ. 6,031 కోట్ల ఆదాయం సమకూరగా… ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల కాలంలో రూ.7,687 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు కేసీఆర్‌. ఈ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 27.45 శాతం వృద్ధితో రూ.1,656 కోట్లు అధికంగా వచ్చిందన్నారు సీఎం.

సుస్థిర ఆదాయ వృద్ధిరేటు ఇదే రకంగా కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి… గత ఏడాది వచ్చిన ఆదాయం కన్నా మరో రూ. 11,500 కోట్లు పెరగనున్నట్లు తెలిపారు. ఆదాయంలో దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూసుకున్నప్పటికీ తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు ఎక్కువగానే ఉన్నట్లు తెలిసిందన్నారు సీఎం కేసీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment