తాజా వార్తలు

Sunday, 5 June 2016

ఆ అర్హత టీపీసీసీకి లేదు


తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత టీపీసీసీకి లేదని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు తాను పీసీసీ అధ్యక్షుడినే గుర్తించనప్పుడు తనకు పీసీసీ నుంచి షోకాజ్ నోటీసులివ్వడమేమిటని ప్రశ్నించారు. తనను వివరణ అడిగే అర్హత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందన్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు ఇవ్వడంపై కోమటిరెడ్డి నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు.
తాను ఎవరికీ వివరణ ఇచ్చేది లేదని, ఏదైనా ఉంటే నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి చెప్పుకుంటానని.. రాష్ట్రంలోని పరిస్థితులను ఆమెకు తెలియజేస్తానని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని, ఆయన నాయకత్వంలో తాను పనిచేసే ప్రసక్తే లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అధ్యక్షుడిని తాను చూడలేదని, కుళ్లు కుతంత్రపు రాజకీయాలకు ఉత్తమ్ మారుపేరని విమర్శించారు. కార్యకర్తలతో మాట్లాడడం కూడా ఉత్తమ్‌కు తెలియదని, బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను త్యజించిన మంత్రి పదవిని ఇస్తే తీసుకుని అనుభవించిన తెలంగాణ ద్రోహి ఉత్తమ్ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోలీసు దెబ్బలు తిన్న తన లాంటి నేతలు పార్టీలో 100 మంది ఉన్నారని, అందులో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా బాగుంటుందన్నారు. తాను పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని, మీడియానే ఆ ప్రచారం చేసిందని పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment