తాజా వార్తలు

Thursday, 2 June 2016

ప్రజల్ని రెచ్చగొట్టాలని యత్నించారు

నవనిర్మాణ దీక్ష పేరుతో చేసిన ప్రసంగంతో సీఎం చంద్రబాబు ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టే యత్నం చేశారని, రెండేళ్ల పాలనలో తాను చేసిందేమిటో చెప్పుకోలేక అబద్ధాలాడి.. విభజన సమయంలో ఏపీ ప్రజలకు జరిగిన గాయాన్ని ఇంకా రేకెత్తించే యత్నం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా రెండేళ్లలో ఏపీ ప్రజలను ఇలా ముందుకు తీసుకెళ్లగలిగానని చెప్పుకోలేకపోయారన్నారు. ఈ దీక్షకోసం విడుదల చేసిన జీవోలో ‘ఏపీ పౌరులు’ అని పేర్కొనడమే దారుణమైన తప్పన్నారు.
మనమంతా భారత పౌరులమేతప్ప రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదన్నారు. జీవో జారీ చేసిన ఐఏఎస్‌లు శిక్షణ పొందింది ముస్సోరిలోనా... ఎన్టీఆర్ భవన్‌లోనా? అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ అవినీతి కేసులో ఇరుక్కోక పోయినట్లైతే ఆదరాబాదరా తట్టాబుట్టా సర్దుకుని తనతోపాటు ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సి వచ్చేదా? ’’ అని ఆమె ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment