తాజా వార్తలు

Thursday, 9 June 2016

‘ఇంగ్లిష్‌’ కావాలి!

సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియానికి డిమాండ్‌ పెరుగుతోంది. గతంలో ప్రైవేట్‌ బాటపట్టిన తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలవైపు దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లలను వాటిల్లో చేర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలకే ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియం పరిమితం కావడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ కూడా పూర్తికాకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరతతో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వరంగల్‌ జిల్లాను ఎంపిక చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జీరో ఎనరోల్‌మెంట్‌ ఉన్న 398 ప్రాథమిక స్కూళ్లలో సైతం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ జీరో ఎనరోల్‌మెంట్‌ స్కూళ్లతో పాటు వివిధ జిల్లాల్లో ఇతర స్కూళ్లలో కూడా ప్రారంభించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
 
                 ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి డీఈవోలను ఆదేశించారు. కానీ కొన్ని జిల్లాల్లో డీఈవోల నిర్లక్ష్యం కారణంగా ఇంకా స్కూళ్ల గుర్తింపు ప్రక్రియనే ప్రారంభం కాలేదు. 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో స్కూళ్లను ఎప్పుడు ఎంపిక చేస్తారని, ఉపాధ్యాయులకు ఎప్పుడు శిక్షణనిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వెంటనే స్కూళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
రంగారెడ్డి జిల్లాల్లో 382 స్కూళ్లు
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఆంగ్లబోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1591 ప్రాథమిక పాఠశాలలు న్నాయి. ఈ సంవత్సరం నుంచి 382 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను బోధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆంగ్ల బోధనకు సంబంధించి 1836 మంది టీచర్లకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 300 ప్రాథమిక స్కూళ్లల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ నెలాఖరులోగా అందరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 46 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 600 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని కలెక్టర్‌ ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు మండలస్థాయి ఎంఈవోల నుంచి ఏయే ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు అవసరమనే ప్రతిపాదనలు జిల్లా విద్యాశాఖకు రాలేదు. కరీంనగర్‌ జిల్లాలో 768 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అనుమతి ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు 12వ తేదీ వరకు గడువు విధించారు.ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను ప్రారంభించాలని 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి పంపాయి. మెదక్‌ జిల్లాలో ప్రతిపాదిత ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ఈ సంవత్సరం 31 ఉన్నాయి. ఇక్కడ కూడా ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు.
 
పాలమూరు అధికారుల నిరాసకత్త 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంగ్లిషు మీడియం స్కూళ్ల ఏర్పాటుపై జిల్లా విద్యాశాఖ ఆశించిన రీతిలో స్పందించడం లేదు. జిల్లాలో 3,827 ప్రభుత్వ పాఠశాలలుండగా, ఇందులో 2,725 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంగ్లిషు మీడియం స్కూళ్లు నడపాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. ఆసక్తిగల స్కూళ్ల ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవల సూచించినా, తగిన చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాధికారులు విఫలమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలు తీసుకుంటున్నామని, రెండు, మూడు రోజుల్లో ఎన్ని స్కూళ్ల నుంచి ప్రతిపాదనలు వస్తాయో తేలుతుందని డీఈవో విజయలక్ష్మీ బాయి తెలిపారు. అయితే జిల్లాలో మారుమూల ప్రాంతమైన దౌల్తాబాద్‌ మండలం రాళ్లగుట్టతండా, బోడమర్రిగడ్డ తండాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేదని, ఉంటే కనుక పిల్లలను అక్కడే చదవిస్తామని ఆయా తండాల వాసులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా ఇంగ్లిషు మీడియంను ప్రారంభించేందుకు ఆయా స్కూళ్ల నుంచి సానుకూలత రావడం లేదని చెప్తుండడం గమనార్హం.

వరంగల్‌ జిల్లాలో పైలట్‌
వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఆంగ్ల మాద్యమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో 746 పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 349, ప్రాథమికోన్నత పాఠశాలలు 127 ఉన్నాయి. 5,4158 మంది విద్యార్థులున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సుమారు 1900 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఒకే స్కూలు నుంచి 1800 దరఖాస్తులు
కొత్తగూడెం మండలం పాతకొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో మొత్తం 1800మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్‌ను బట్టి సీట్లు ఇవ్వడం, అవసరమైన అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment