తాజా వార్తలు

Sunday, 5 June 2016

కేసులకు భయపడి రాష్ట్రాన్ని అమ్మేశాడు

‘‘రెండేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల  సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మోసపు మాటలతో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యాడు. కేసులకు భయపడి స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టాడు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసుకు భయపడి ఏపీకి తాగడానికి నీళ్లు లేకుండా చేశాడు. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు.. ఒక్కరని  కాదు, ఏకంగా మొత్తం రాష్ట్రాన్నే మోసం చేశాడు. ఇలా మోసం చేసిన వ్యక్తులకు రాయలసీమలో అయితే చెప్పులు చూపించి, చెప్పులతో కొట్టాలి అంటారు. నేనైతే అనడం లేదు. చెప్పులంటే చంద్రబాబుకు ఉలికిపాటు వస్తోంది.
ఆయనకు ఇష్టం లేదు కాబట్టి చెప్పులు ఒక్కటే వద్దులే! చెప్పులతోపాటు చీపుర్లు కూడా చూపించండి’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు ఆదివారం ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవర చెరువు(ఓడీసీ) మండలం వడ్డివారిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే   ఓడీసీలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తర్వాత అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్  సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సభ’కు హాజరై ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

 ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు
 ‘‘అనంతపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ కాబోతోంది. కాపాడండి అని ఆక్రోశిస్తూ వేలాది మంది నడిరోడ్డుపైకి వచ్చారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోంది? ఆయన చేస్తున్నదేమిటి? అని పరిశీలిస్తే.. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో మోసం చేయడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదు. అవినీతిలో నిండా మునిగిపోయారు. ఈ రెండేళ్లలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలో అంతా గుండెలపై చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. రెండేళ్ల కిందట ఎన్నికల  సమయంలో చంద్రబాబుకు ప్రజలతో పని పడింది. ఆరోజు ఉపన్యాసాల్లో, ఫ్లెక్సీలు, టీవీలు, గోడలపైనా హామీల వర్షం కురిపించారు.

బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక బంగారం ఇంటికి రాలేదు. వేలం నోటీసులు వస్తున్నాయి. బ్యాంకర్లు ఇంటికి వచ్చి నానా మాటలూ అంటున్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానన్నారు. ఆయన మాటలు విని రైతులు రుణాలను తిరిగి చెల్లించనందుకు రూ.25 వేల కోట్లు వడ్డీ భరించాల్సి వస్తోంది. ఈ పెద్దమనిషి మాత్రం శనక్కాయలు, బెల్లానికి కూడా సరిపోని విధంగా.. వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోని మాఫీ అమలు చేశారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. మాఫీ మాట దేవుడెరుగు ముష్టి వేసినట్లు రూ.3 వేలు అప్పు ఇచ్చి అదే మాఫీ అంటున్నారు. డ్వాక్రా మహిళలకు గతంలో వడ్డీలేని రుణాలు వచ్చేవి. ఇప్పుడు రూ.2 వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికీ ఇస్తానన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్న జాబులన్నీ పీకేస్తున్నారు. అందరికీ ఇళ్లు కట్టించి గుడిసెలు లేని రాష్ట్రాన్ని చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఒక్కరికైనా ఇల్లు కట్టిచ్చారా?  

 ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’ని మర్చిపోగలమా?
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసం చేశారు. బీజేపీతో కలసి చేసిన ఎన్నికల ప్రచారంలో ఐదేళ్లు కాదు.. 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటే ప్రధానమంత్రి మోదీని తెలుగులో తిడతారు. ఢిల్లీకి వెళితే ఇంగ్లిషు, హిందీలో పొగుడుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటామని చంద్రబాబు అల్టిమేటం ఇవ్వడం లేదు. అల్టిమేటం ఇస్తే రెండేళ్ల అక్రమాలపై మోదీ సీబీఐ కేసులు పెట్టిస్తారని బాబు జంకుతున్నారు. కేంద్రంపై ఎలాగూ పోరాడలేకపోతున్నారు. కనీసం పక్క రాష్ట్రంతోనైనా పోరాడతారనుకుంటే అదీ లేదు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.

శ్రీశైలంలో 800 అడుగుల నుంచే లిఫ్ట్‌లు పెట్టి నీళ్లు తోడుతుంటే కనీసం అడిగే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు సూట్‌కేసులను బ్లాక్‌మనీతో నింపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి వెళ్లాడు. ఆపై చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’ అని ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేం. రాష్ట్ర ముఖ్యమంత్రి సూట్‌కేసుల్లో బ్లాక్‌మనీ ఇస్తూ పట్టుపడితే ఏడాదిగా అరెస్టు చేయకుండా వదిలేశారు. ప్రాజె క్టులపై కేసీఆర్‌ను నిలదీస్తే చంద్రబాబు మాట్లాడిన ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’ అన్న మాటలు బయటకి వస్తాయి. బాబును జైల్లో పెడతారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి బాబు రాష్ట్రాన్నే తాకట్టుపెట్టారు. మోసం చేసి రాష్ట్రాన్ని అమ్మేశారు. రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ఇసుక నుంచి బొగ్గు దాకా, రాజధాని భూముల నుంచి గుడి భూముల దాకా ఎక్కడ చూసినా అవినీతే. చివరకు గుడిని, గుడిలోని లింగాన్ని సైతం మింగేసే పరిస్థితి దాపురించింది.

 విశ్వసనీయతకు పాతరేసిన చంద్రబాబు
 చంద్రబాబు చేసిన దగా వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోనే 81 కుటుంబాలను పరామర్శించా. బాధితుల్లో 14 మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరి చావులకు కారణం ఎవరు? ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి నోట్లోనుంచి ఒక మాట వస్తే దానిపై అతడు నిలబడాలి. దానికోసం ఎందాకైనా నడవాలి. అప్పుడే రాజకీయాలకు విశ్వసనీయత వస్తుంది. అలా రాజకీయాలకు విశ్వసనీయత తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖరరెడ్డే. విశ్వసనీయతకు పాతరేసిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థ మారాలంటే అంతా ఒక్కటి కావాలి. అందరూ చైతన్యవంతులు కావాలి. రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసి నెరవేర్చకపోతే ప్రజలు చెప్పులు, చీపుర్లు చూపిస్తారనే పరిస్థితి రావాలి. అప్పుడే వ్యవస్థ మారుతుంది.

 చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు
 రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన మా కార్యకర్తలు ఆస్పత్రిలో ఉంటే పరామర్శించేందుకు ప్రకాశ్ (రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి) వెళ్లారు. ప్రకాశ్‌ను ఇబ్బంది పెట్టాలని, చంపాలని టీడీపీ వారు ఆయుధాలతో వెళ్లింది నిజం కాదా? ప్రభుత్వమే పట్టపగలే ఖూనీలు చేయిస్తే ప్రజలకు ఎక్కడికి పోవాలి? తహసీల్దార్ కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డిని చంపారు. షాపు ఇవ్వలేదని ప్రకాశ్‌శెట్టిని హత్యచేశారు. సింగిల్ విండో అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డిని సొసైటీ ఆఫీసుకు పిలిపించి హత్య చేశారు. ప్రభుత్వమే హత్యలు చేయిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి పోలీసుకూ చెబుతున్నా! చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. చంద్రబాబు ఒత్తిడి చేసినా... దయచేసి మానవతా దృక్పథంతో వ్యవహరించండి. మీరు వేసుకున్న చొక్కాలకు జీతాలిచ్చేది చంద్రబాబు కాదు. ప్రభుత్వం అనే సంగతి మరవొద్దు. ఈ రోజు చంద్రబాబు ఉంటారు. రేపు మేమొస్తాం అని మరవొద్దు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. ధర్నాలు చేస్తాం.

 వైఎస్‌ను ప్రేమించే ప్రతీ గుండె మాకు తోడు
 ప్రజల గొంతు వినిపించకపోతే తనను ఎవరూ ప్రశ్నించలేరని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజల గొంతు వినపడకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్లు ఎరచూపి కొంటున్నారు. ఇప్పటివరకూ 19 మంది ఎమ్మెల్యేలను కొనడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు నిలదీస్తారనే సంగతి మరవొద్దు. ఎమ్మెల్యేలను కొంటే మా గొంతు మూగబోతుందని అనుకోవచ్చు. మీ(చంద్రబాబు) ఆలోచన తప్పు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి గుండె మాకు తోడుగా ఉంది. మళ్లీ వారంతా ఏకమై వారి నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటారు. అవినీతి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఓడిపోతారనే భయంతో రాజీనామా చేయించలేకపోతున్నారు. అందుకే జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కోపం తీర్చుకుంటున్నారు.

 బాబు మోసాలపై 8న పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయండి
 ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

 అనంతపురం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయవంచనకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన చేస్తున్న మోసాలపై ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. వందల కొద్ది హామీలు గుప్పించి ఒక్కటి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.

 విలన్ ఓడిపోతాడు... హీరో గెలుస్తాడు
 ‘‘చంద్రబాబు లాంటి వ్యక్తిని చూస్తే సినిమాల్లో విలన్ పాత్ర గుర్తుకొస్తోంది. సినిమాల్లో 14 రీళ్లు ఉంటే 13 రీళ్లదాకా విలన్‌దే ఆధిపత్యం. హీరో అమాయకుడు. చంద్రబాబుకు తెలిసినంత   స్థాయిలో ఆ హీరోకు అవినీతి తెలియదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేడు. అబద్ధాలు చెప్పలేడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. సినిమా ల్లో 14వ రీల్ వచ్చేసరికి కథ  క్లైమాక్స్‌కు వస్తుంది. కథ అడ్డం తిరుగుతుంది. విలన్ జైలుకు వెళ్తాడు. హీరో రాజవుతాడు. ప్రతి సినిమాలోనూ ఇదే జరుగుతుంది.’’

 అనంతపురం జిల్లా మనవడిని
 ‘‘అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నెలరోజుల పాటు భరోసా యాత్ర చేశా. ప్రతి గడపా తొక్కా. ప్రతి కుటుంబానికీ ఆసరా ఇచ్చా. నాకు చేతనైన మేర సాయం చేశా. నియోజకవర్గం దాటిన తర్వాత ఏదైనా ఘటన జరిగి ఉంటే వారందరికీ గట్టిగా భరోసా ఇస్తాం. జిల్లా ప్రజ లు చూపిన ఆదరణను జీవితంలో మరవలేను. నేను అనంతపురం జిల్లా మనవడిని అనేది మరవొద్దు.’’
« PREV
NEXT »

No comments

Post a Comment