తాజా వార్తలు

Friday, 10 June 2016

'రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు'


రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే ముద్రగడ దీక్ష చేపట్టారన్నారు.
ఇంట్లో చేస్తున్న దీక్షకు భారీగా పోలీసులను ఎందుకు పంపారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మాట తప్పింది, మోసం చేసింది చంద్రబాబు నాయుడే అని అన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్నే అమలు చేయమని ముద్రగడ కోరారన్నారు. హామీని అమలు చేయమని కోరితే దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గతంలో కూడా చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఒకే కులంలో విభేదాలు సృష్టించి ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతున్నారని ఆయన అన్నారు. ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు వందలాదిమంది పోలీసులను పంపారన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సాక్షి టీవీ ప్రసారాలను గురువారం నుంచి నిలిపివేశారన్నారు. ముద్రగడ వార్తలను ప్రసారం చేయొద్దని అనుకూల మీడియాకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. మీడియా ప్రసారాలు నిలిపివేయడం సరికాదని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయన్నారు. కానీ ఎప్పుడూ వైఎస్ఆర్ మీడియా జోలికి వెళ్లలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే చంద్రబాబు ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెర లేపారన్నారు.

మాట ఇచ్చి తప్పింది చంద్రబాబేనని, మోసం చేసింది కూడా చంద్రబాబేనని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటు అయిందని, మోసం చేస్తున్నారని అడగటం తప్పా అన్నారు. ఇటువంటి నాయకులకు ప్రజలు ఎప్పుడు చీపుర్లు చూపిస్తారో....అప్పుడే వ్యవస్థతో పాటు చంద్రబాబులాంటి వ్యక్తులు మారతారన్నారు. అందరూ కలిసికట్టుగా నిరసనలు తెలపాలని వైఎస్ జగన్ సూచించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తుని ఘటనను సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
సీఐడీ పేరుతో దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అన్నారు. బాబు చేస్తున్న అన్యాయం అందరికీ అర్థం అవుతుందన్నారు. తుని ఘటనపై  థర్డ్ పార్టీ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి శాంతి,భద్రతల సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. నచ్చని మీడియా ప్రసారాలను ఆపివేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని వైఎస్ జగన్ అభివర్ణించారు. కట్ చేసిన ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment