తాజా వార్తలు

Tuesday, 7 June 2016

చంద్రబాబు.. అసమర్థ సీఎం: రోజా

రెండేళ్ల పాలనలో సమాజంలో ఏ ఒక్కరికీ న్యాయం చేయని అసమర్థ సీఎం చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ప్రపంచానికే పాఠాలు చెప్పానని గొప్పలు చెప్పుకునే ఈ పెద్దమనిషి ప్రజామోదమైన పాలనను అందించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అయ్యప్పమాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని, పేకాట ఆడితే ఉల్లాసంగా ఉంటుందని, చెక్కభజన చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్న బాబు మతిస్థిమితం కోల్పోయారని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో తక్షణం చేర్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని చంద్రబాబు.. కుమారునితో కలసి రాష్ట్రాన్ని అడ్డంగా దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా భూములన్నీ బాబు, లోకేశ్‌బాబు.. వారి బినామీలే కబ్జా చేస్తున్నారన్నారు. తండ్రీకొడుకుల అవినీతి ఇస్రో రాకెట్లకన్నా వేగంగా దూసుకెళుతోందని, తండ్రి అవినీతి అనకొండ అయితే తనయుడు కమీషన్ల కొండచిలువని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సంతకాలు చేసి డీల్స్ చేస్తూంటే.. లోకేశ్‌బాబు డబ్బులు తీసుకుంటూ కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారన్నారు.
 అసెంబ్లీని దిగజార్చారు: గడికోట
 ఏపీ అసెంబ్లీ సమావేశాల స్థాయిని అధికారపక్షం టీడీపీ దారుణంగా దిగజార్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గత రెండేళ్లలో అసెంబ్లీ ఏడుసార్లు సమావేశమవగా.. ఏరోజూ సభలో అధికారపక్షం హుందాగా చర్చలు జరగనీయలేదని, ఏ ప్రజాసమస్యల్ని చర్చకు తెచ్చినా ఎదురుదాడికి దిగిందని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభలో ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి శాసనాన్నిగానీ, ఒక మంచిపనిగానీ టీడీపీ చేయలేదన్నారు. ప్రజల తరఫున గళమెత్తిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తప్పించుకోజూశారు తప్పితే ఆయనడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదన్నారు. స్పీకర్ కోడెల పరిధిలో మంత్రి యనమల జోక్యం చేసుకుని ఆయనెలా వ్యవహరించాలో కూడా నిర్దేశిస్తున్నారన్నారు. ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపడుతోందని సీఎం చంద్రబాబు అనడంలో అర్థం లేదన్నారు.

 సంక్షేమం ఊపిరి తీశారు: ధర్మాన
 చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమై రాష్ట్ర ప్రజలను దారుణంగా హింసించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రెండేళ్లలో ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రవేశపెట్టకపోగా ఉన్న వాటి ఊపిరి తీశారని విమర్శించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమమే తన ఎజెండా అని చెప్పి ఆచరణలో దానిని గాలికొదిలేశారన్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను నీరు గార్చిన ఫలితంగా విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సి వచ్చిందని, ఆరోగ్యశ్రీ పథకం కుంటుపడిందన్నారు. గృహాల నిర్మాణం గాని, భూపంపిణీ గాని జరిగిందా? నిరుద్యోగులకు ఉపాధి కల్పించారా? అని ధర్మాన నిలదీశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment