తాజా వార్తలు

Thursday, 2 June 2016

ఎమ్మెల్యేలను కొనడమే రాష్ట్రాభివృద్ధా ?

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడమే రాష్ట్రాభివృద్ధా అని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సీఎం చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు. రైల్వేకోడూరులోని వైఎస్ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు, పనులకు ఆశ పడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కొన్నా ప్రజలను కొనలేం అనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు 198 హామీలు ఇచ్చారని, వాటిలో పింఛను ఒక్కటే అదీ అరాకొర మాత్రమే అమలు చేశారని విమర్శించారు. టీడీపీ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని, ఆ పార్టీ నాయకులకే అంతా కట్టబెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో మాఫియాల పర్వం కొనసాగుతోందని కొరుముట్ల అన్నారు. ఇసుక, మైనింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మాఫియా చాలానే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ హయాంలో గాలేరు-నగిరి పనులకు శ్రీకారం చుడితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాటి పనులకు రూ. 10 వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అవినీతి, అక్రమ సంపాదనతో అడ్డుగోలుగా ఎమ్మెల్యేలను కొన్న విషయం పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరికి వివరించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment