తాజా వార్తలు

Tuesday, 14 June 2016

'వైఎస్ జగన్ సీఎం అవుతారనే రాష్ట్ర విభజన'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారనే... రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని చాలా దుర్మార్గంగా విభజించారన్నారు. 

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటే... కాదు పదేళ్లు ఇవ్వాలని బీజేపీ అడిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కాదు...ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని మేకపాటి మండిపడ్డారు. ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని బీజేపీ సర్కార్ కుంటిసాకులు చెబుతోందన్నారు. హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని, దాన్ని సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుదన్నారు.


ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేకపాటి అన్నారు. హోదా కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, హోదా సాధించేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ జగన్ కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని మేకపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ లోపల, వెలుపల వైఎస్ఆర్ సీపీ ఎంపీలందరు చాలాసార్లు పోరాడామన్నారు.

టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఓ వైపు చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, మరోవైపు అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్నారన్నారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, కొనుగోలు చేయడం ఎంతవరకూ సమంజసమన్నారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు విఫలం అయితే ప్రజలు క్షమించరన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment