తాజా వార్తలు

Friday, 1 July 2016

తాడోపేడో చంద్రబాబుతో తేల్చుకుంటాం

రాజకీయాలు చేయాలంటే..ప్రత్యర్ధి పార్టీలపైనే కాదు..సొంత పార్టీ నేతలపైనా చేయవచ్చు..వారిని ఇరుకున పెట్టడానికి, వారిపై ఒత్తిడి తేవడానికి ఎన్నిరకాలుగానైనా ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేయడం వలన పార్టీకి నష్టం వస్తుందా..లేదా, అనే అంశం వారికి అనవసరం..తమ పంతం మాత్రం నెగ్గాలనే అనుకుంటున్నారు. రాజకీయ పార్టీల అధిష్టానాలు కూడా ఆ విధంగా చిచ్చు పెట్టే వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. పార్టీ కోసం కష్టం పడ్డ వారిని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన వారి మాటలకు విలువ ఇవ్వని విధంగా పార్టీల అధిష్టానాలు ప్రవర్తిస్తున్నాయనుకోండి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి విదానంమే జరుగుతోంది. రెండు మార్కెట్ కమిటీల నియామకంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట చెల్లుబాటు కాకుండా ప్రత్యర్ధి వర్గం అడ్డుపడుతూ, అనేక ఇబ్బందులు పెడుతోందట..ఏడాదిన్నరగా సంబంధిత ఫైలు పెండింగ్ లో ఉండడంతో సదరు ఎమ్మెల్యే గారికి చిర్రెత్తుకొచ్చి తాడోపేడో తేల్చుకోవాడినికి సిద్దపడుతున్నారట. ఈ కధేంటో మీరూ తెలుసుకోండి
               
            ఎన్నికల టైమ్‌లో రాజకీయాలు చేయవచ్చు...కానీ తర్వాత కూడా అదే పనిగా పెట్టుకుంటే ఎవరికి నష్టం..? పార్టీకే నష్టం.. అంతేనా ప్రజల్లోనూ చులకన అవుతారు.. నాయకులు వర్గ విభేదాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఎలా..? పార్టీ పట్లే కాదు...అధినాయకుల పట్ల కూడా కొంత ఎడబాటు ఎదురవుతుంది..ఆచంట నియోజకవర్గంలో అదే జరుగుతోందనేది టీడీపీ నాయకుల భావన... ఎమ్మెల్యే మాటలు పట్టించుకోకుండా... పార్టీకి వ్యతిరేకంగా పని చేసి... ఇప్పుడు తామే పార్టీ అంటూ ఊరేగుతున్న నాయకుల మాటలకే అధిష్టానం విలువ ఇస్తున్నదట! ఇదే నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌ అయ్యింది.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందడం.. అటు పిమ్మట తెలుగుదేశం పార్టీ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకోవడం కొంతమంది స్థానిక నేతలకు కంటగింపుగా మారిందట! దాంతో వారు పితాని ఏ పని చేపట్టినా.. దానిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారట! ఆ విధంగానే ఆచంట,పెనుగొండ మార్కెట్‌ యార్డులకు కమిటీల నియామకాన్ని వారు అడ్డుకున్నారు.
 
                ఏడాదిన్నరగా కమిటీల నియామకంలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆచంట తెలుగుదేశం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ఇందుకు కారణం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అని సొంత పార్టీ వారే చెప్పేస్తున్నారు. దీనికి కారణం కూడా వారే తెలుపుతున్నారు. అదేమిటంటే ఇంతకు ముందు నియోజకవర్గ కన్వీనర్‌గా పని చేసిన గొడవర్తి శ్రీరాములు మధ్య ఏర్పడిన అగాధమే వీటంన్నీటికీ కారణమట!
               
                వాస్తవంగా చూస్తే 2014 ఎన్నికల దగ్గర నుంచే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో ఆచంటలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోమని హామీ ఇవ్వాలని ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు గొడవర్తి శ్రీరాములు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణను అడిగారట! అందుకు ఆయన అంగీకరించలేదట! దాంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు అంతా పితానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారట! అంతే కాకుండా అప్పటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రసాదరాజుకు అనుకూలంగా రహస్యంగా ప్రచారం చేశారట! అయితే అదే సామాజికవర్గానికి చెందిన తెలుగు యువత రాష్ర్ట కార్యదర్శి ఉప్పలపాటి సురేశ్‌బాబు మాత్రం పితానికి సపోర్ట్‌ చేశారు. పార్టీ ఎవరిని నిలబడితే వారికే అనుకూలంగా పని చేస్తానంటూ మిగతా నాయకులతో విభేదించి పితాని గెలుపుకోసం కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారట! అదే పెనుగొండలో బీసీ నాయకుడు సానబోయిన గోపాలకృష్ణ కూడా పితాని గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో పితాని సత్యనారాయణ గెలుపొందడం ప్రత్యర్థి వర్గానికి రుచించలేదట! ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆచంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సురేశ్‌బాబు, పెనుగొండ కమిటీ ఛైర్మన్‌గా సానబోయిన గోపాలకృష్ణ పేర్లను ఖరారు చేస్తూ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట! ఆ ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆమోద ముద్ర వేస్తూ సంతకం కూడా చేశారట!
 
                    ఆ ఫైలు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చే సమయంలో గొడవర్తి శ్రీరాములు వర్గం రాజకీయం మొదలు పెట్టిందట! పితాని సూచించిన వారికి మార్కెట్‌ పదవులు ఇవ్వడానికి వీలు లేదంటూ చంద్రబాబు దగ్గర లొల్లికి దిగారట! దీంతో చంద్రబాబు ఆ ఫైలును అలాగే పెండింగ్‌లో పెట్టారట! ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర అయ్యింది. ఇంత వరకు ఆ ఫైలులో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఎమ్మెల్యే పితాని వర్గంలో అసహనం చోటు చేసుకుందట! సామాజికవర్గం పేరుతో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి తెలుగుదేశం అధిష్టానం ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి మాటలకు విలువ లేకుండా చేయడం ఎంత వరకు సబబు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలాగైతే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని బహిరంగంగానే చెబుతున్నారట! చూస్తుంటే...వారి ఆవేదనలో అర్థం ఉందనిపిస్తోంది.. కొంతమంది నాయకుల మాటకు విలువ ఇస్తూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేను పట్టించుకోకపోతే...భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బందే! మరి అధిష్టానం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.. ఇదండీ ఆచంట...పెనుగొండ మార్కెట్‌ కమిటీలు అండ్‌ పితాని వర్సెస్‌ గొడవర్తి శ్రీరాములు కథ.
« PREV
NEXT »

No comments

Post a Comment