తాజా వార్తలు

Saturday, 2 July 2016

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని కలిగించిన ఐటీ ఉద్యోగి స్వాతి హత్య కేసును పోలీసులు ఛేదించిన విధానం అందరిలోనూ తీవ్ర ఆసక్తిని కలిగించింది. ఎటువంటి ఆధారాలు లేని స్థితిలో చెన్నై నుంగంబాక్కం నుంచి మొదలుపెట్టి, శనివారం ఉదయం సెంగోటై వరకు సాగిన ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నుల్ని పరిశీలిస్తే...
 
జూన్ 24:
ఉదయం 6 గంటలకు చూళైమేడు నుంచి నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌కు స్వాతిని ఆమె తండ్రి సంతానగోపాలకృష్ణన్ బైకుపై తీసుకొచ్చి వదలిపెట్టారు. ఉదయం 6.30 గంటలకు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న స్వాతిని వెనుకనే నిలబడ్డ ఒక గుర్తుతెలియని యువకుడు పొడవాటి కత్తితో హత్య చేసి పారిపోయాడు. ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ప్రయాణికులు దిగ్ర్భాంతికి గురయ్యారు. కొంతమంది హంతకుడిని పట్టుకునేందుకు పరుగెత్తినా ప్రయోజనం లేకపోయింది. రక్తపుమడుగులో స్వాతి మృతదేహం ప్లాట్‌ఫామ్‌పై పడి ఉన్నా రెండు గంటల దాకా రైల్వేపోలీసులు తరలించలేదు. ఉదయం 9 గంటలకు రైల్వే పోలీసులు అక్కడికొచ్చి మృతదేహాన్ని తరలించారు. అప్పుడే తెలిసింది ఆ ప్లాట్‌ఫామ్‌పై సీసీటీవీ కెమెరాలు లేవని. కొద్ది సేపటికే స్వాతి హత్య వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. రాష్ట్రమంతటా తీవ్ర సంచలనం సృష్టించింది. 
 
జూన్ 25:
నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో హంతకుడిని గుర్తించడానికి, పట్టుకునేందుకు రైల్వే పోలీసులకు వీలులేకపోయింది. ఆ రైల్వేస్టేషన్ సమీపంలోని కొన్ని ఇళ్ళలో అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలలో హంతకుడు పరుగెత్తుతున్న దృశ్యం, ఓచోట నింపాదిగా నడుస్తున్న దృశ్యాలు నమోదై ఉన్నట్టు గుర్తించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తే హంతకుడై ఉంటాడని ఆ ఫోటోలను పత్రికలకు విడుదల చేశారు.
 
జూన్ 26:
రైల్వేస్టేషన్ సమీపంలోని మరో ఇంటి సీసీటీవీ కెమెరాలో హంతకుడు గోడను దాటుతున్న దృశ్యం లభ్యమైంది. ఆ వీడియో దృశ్యాన్ని ప్రసారమాధ్యమాలకు విడుదల చేశారు. రెండు వీడియో దృశ్యాలలోనూ హంతకుడి ముఖం అస్పష్టంగా కనిపించింది. అతడే హంతకుడా అనే అనుమానం బయలుదేరింది.
 
జూన్ 27:
స్వాతి హత్య జరిగినా రైల్వేపోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. హైకోర్టు ధర్మాసనం స్వచ్ఛందంగా స్వాతి హత్య కేసుపై విచారణ చేపట్టి ఆదేశించిన దరిమిలా ఆ హత్య కేసును చెన్నై మహానగర పోలీసులకు బదిలీ అయింది. హంతకుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల నియామకం జరిగింది. స్వాతి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్‌పై పరీశీలన, ఆమె స్నేహితుల వద్ద విచారణ చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు స్వాతి కుటుంబీకులను పరామర్శించటంతో కేసుపై రాజకీయ ప్రభావం అధికమైంది.
 
జూన్ 28:
స్వాతి హత్యకేసుపై నగర పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ రాజకీయ నాయకులు నుంచి విమర్శలు వచ్చాయి. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని రెండు రోజుల్లో కేసు దర్యాప్తు పురోగతిని సాధించకపోతే తామే విచారణకు దిగుతామని హెచ్చరించింది. స్వాతి గురించి ఎలాంటి అవాస్తవ సమాచారాలను వ్యాపింపచేయవద్దని ఆమె తండ్రి సంతానగోపాలకృష్ణన్ అభ్యర్థన. జూన్ 29:
స్వాతి ఫేస్‌బుక్‌ స్తంభన- చెంగల్పట్టు సమీపంలోని పరనూరు రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల విచారణ - రోజూ స్వాతి ఆ స్టేషన్‌లో దిగి ఆఫీసుకు వెళ్ళేప్రాంతంలో.. హంతకుడి ఫోటో పట్టుకుని ఇంటింటా ఆచూకీ కోసం  గాలింపు.
 
జూన్ 30:
 • హంతకుడి వీడియో దృశ్యాలను మెరుగుపరచి కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అతడి ఊహా చిత్రాల విడుదల.
 • స్వాతి సెల్‌ఫోన్ చివరిసారిగా పనిచేయకుండాపోయిన ప్రాంతం చూళైమేడుగా కనుగొన్న పోలీసులు
 • చూళైమేడులో ఇంటింటా వెళ్లి పోలీసుల విచారణ హంతకుడి ఫోటోను చూపి ఆచూకీ కోసం ప్రయత్నాలు.
 • చూళైమేడు మేన్షన్‌లలో పోలీసుల విచారణ 
 • ఏఎస్‌ మేన్షనలో హంతకుడి ఫోటోను చూపి మేనేజర్‌ వద్ద విచారణ.
 • హంతకుడిని సమీపిస్తున్నామని నగర పోలీసు కమిషనర్‌ రాజేంద్రన ప్రకటన
 
జూలై 1:
 • హంతకుడు బసచేసిన ఏఎస్‌ మేన్షన్‌లో వాచ్‌మెన్ వద్ద పోలీసుల విచారణ. హంతకుడు ఆ మేన్షనలోనే బసచేసినట్టు నిర్దారణ. హంతకుడి గదిలో ఉద్యోగపు దరఖాస్తులో హంతకుడి పేరు, ఊరు ఇతర వివరాలు లభ్యం. రక్తం తడిసిన చొక్కా స్వాధీనం. చివరకు హంతకుడు తిరునల్వేలి జిల్లా సెంగోటై సమీపంలోని మీనాక్షిపురానికి చెందినవాడని నిర్ధారణ

 • హంతకుడు ఉపయోగించిన కత్తి సైతం తిరునల్వేలి జిల్లాలో తయారైందని అప్పటికే గుర్తింపు.

 • రాత్రి తొమ్మిది గంటలకు హంతకుడు రామ్‌కుమార్‌ను అతడి ఇంటిని చుట్టుముట్టి పట్టుకోవాలని తిరునల్వేలి పోలీసులకు ఆదేశాల జారీ చేసిన చెన్నై మహానగర పోలీసులు

 • రాత్రి 10 గంటలకు మఫ్టీ పోలీసులు మీనాక్షిపురంలోని హంతకుడి నివాసగృహం వద్ద నిఘా.

 • 10.30 గంటలకు హంతకుడి ఇంటిని చుట్టుముట్టిన సాయుధ పోలీసు ఉన్నతాధికారులు

 • పోలీసుల అలికిడి విని ఇంటి పెరట్లో మేకల కొట్టాములో నిదురపోతున్న హంతకుడు రామ్‌కుమార్‌ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యయత్నం.

 • పోలీసులు అతడి నిర్బంధించి చికిత్స కోసం తరలింపు.
ఈ క్రమంలో స్వాతి హంతకుడిని నగర పోలీసులు అరెస్టు చేసి ముఖ్యమంత్రి జయలలిత నుంచి ప్రశంసలందుకోవటం విశేషం. శనివారం ఉదయం స్వాతి హంతకుడు అరెస్టయ్యాడన్న వార్తతో ఉత్కంఠ నుంచి నగరవాసులు బయటపడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment