తాజా వార్తలు

Friday, 1 July 2016

మాకు లేదా నోరు!

స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవలసిన విషయాల్లో గొడవపడటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణలో అనవసర రాద్ధాంతం జరుగుతోందని తెలిపారు. ‘‘విభజన సమయంలో అన్నీ వదులుకున్నాం. హైకోర్టును వదులుకోవడం పెద్ద విషయమేం కాదు. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనాన్ని ఐకానిక్‌ నిర్మాణంగా చేపడుతున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది’’ అని తెలిపారు. చైనా, ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు... శుక్రవారం సాయంత్రం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణతో నెలకొన్న వివాదాలపై సవివరంగా స్పందించారు. వివాదాల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీకి తాను నాలుగైదుసార్లు ప్రయత్నించానని... ఒకేవైపు అనుకుంటే చర్చలు జరగవని తెలిపారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు రాషా్ట్రల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. కేంద్రాన్ని కోరినా అక్కడి నుంచీ స్పందన లేదు. ఏదో ఒకటి అనడానికి ఒక్క నిమిషం పట్టదు. నాకు మాత్రం నోరు లేదా? అందరం సయోధ్యతో ముందుకు పోదామని చెబుతున్నా. తెలంగాణ సీఎంతో మాట్లాడటానికి నాకేం భేషజం లేదు. వారికి కావలసినవి అడుగుతున్నారు. చట్టంలో ఉన్నవాటిని మాత్రం కాదంటున్నారు. నేను ఉభయతారకమైన పరిష్కారానికి సిద్ధం. నేను వాళ్లకీ వీళ్లకీ భయపడుతున్నానని కొందరు మాట్లాడుతున్నారు. అదేం కాదు. గొడవలు పడితే సాధించేదేమీ లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకూ స్వయంప్రతిపత్తి ఉంటుందన్నారు. ‘‘రాజకీయాలు వేరు. రాష్ట్రాలు వేరు. వారి వారి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి’’ అని చంద్రబాబు తెలిపారు.
 
తెలంగాణ ప్రజలూ ఆలోచించాలి
‘‘రెండు రాష్ట్రాల్లో తెలుగువారున్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవంకోసం. అందుకే నష్టమైనా, కష్టమైనా విభేదాల్లేకుండా ఉందామని చెబుతూ వస్తున్నాను. అదే సమయంలో నవ్యాంధ్ర ప్రజలు తమ హక్కులు కాపాడాలని, అభివృద్ధి చేయాలని నాకు బాధ్యత అప్పగించారు’’ అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మనమంతా ఒక్కటే. తెలుగువారం. మీరు విభజన కావాలనుకున్నారు. అయిపోయింది. ఇంకా కొందరు రెచ్చగొడుతున్నారు. వివాదాలు పెట్టుకోవడం సరి కాదు’’ అని విజ్ఞప్తి చేశారు.
‘‘విభజనలో అన్యాయం ఆంధ్రాకు జరిగింది. ఒకప్పుడు చెన్నై వెళ్లాం. అక్కడి నుంచి కర్నూలుకు వచ్చాం. తర్వాత హైదరాబాద్‌కు. ఇప్పుడు కట్టుబట్టలతోనే కాదు... అప్పులతో వచ్చాం’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా దగ్గర డబ్బు లేదు. జీతాలకూ లేవు. మనకు రెండందాలా ఖర్చు! హైదరాబాద్‌లో ఆఫీసు నిర్మించుకున్నా. ఇక్కడికి వస్తూనే బస్సులో పడుకున్నా. అక్కడి నుంచి ఈ ఆఫీసు కట్టుకున్నా. మళ్లీ ఇప్పుడు అమరావతిలో కట్టుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఆఫీసులకు డబ్బు కొంత అదనంగా కూడా ఖర్చవుతూ ఉంది. ఆఫీసు లేకుండా చెట్ల కింద మాట్లాడలేం కదా? ఎవర్నైనా పిలిచి చెట్ల కింద మాట్లాడితే రాను కూడా రారు. పెట్టుబడిదారులను ఆకర్షించలేం’’ అని తెలిపారు.
 
ఏడెకరాలు నేను ఇప్పించిందే!
ఢిల్లీలోని ఏపీ భవన్‌ వివాదంపైనా చంద్రబాబు స్పందించారు. ‘‘ఢిల్లీలో ఉన్న నిజాం భవనాన్ని కేంద్రం తీసుకుంటే.. నేను సీఎంగా, వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేను మాట్లాడి దానికి బదులుగా ఏడెకరాల స్థలాన్ని ఢిల్లీ తీసుకున్నాం. అలాంటివి అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదు. హైదరాబాద్‌ నా హయాంలోనే బాగా అభివృద్ధి చెందింది. అది నా బ్రెయిన్‌ చైల్డ్‌’’ అని వ్యాఖ్యానించారు.
 
కేంద్రమే పరిష్కరించాలి!
విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. ‘‘అపెక్స్‌ సంస్థ, బోర్డులు ఉంటే సమావేశం జరపకుండా మీరు-మీరు పరిష్కరించుకోండంటే ఎలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు. ఆస్తుల విషయంలో ఏకపక్ష వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని సిఎం గుర్తు చేశారు. ఉన్నత విద్యా మండలి కేసులో ఇచ్చిన తీర్పు అమలుకోసం తాను ప్రయత్నించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం స్పందించలేదని ఆక్షేపించారు. ‘‘ప్రాథమిక దశలో ఉన్న రాషా్ట్రనికి కేంద్ర సాయం అవసరం. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కూడా అవసరం. అదే సమయంలో ప్రజల ప్రయోజనాలు కాపాడకపోతే విశ్వాసం కోల్పోతాం. ఈ రెండు సమన్వయం చేసుకుంటూ పోవాలి’’ అని చంద్రబాబు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవను కేంద్రం రాజేస్తోందని తాను అనుకోవడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.

ఇందుకే హైకోర్టు ఆలస్యం...

‘‘పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని చెప్పారు. అయినా అక్కడే ఉండలేదు కదా! అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు వదులుకుంటే ఏమవుతుందండీ! హైకోర్టు ఒక ఐకానిక్‌ బిల్డింగ్‌గా ఉండాలనుకున్నందుకే ఆలస్యం జరుగుతోంది. ఏదో ఒక షెడ్డు వేయాలనుకుంటే మూడు నెలల్లో అయిపోతుంది’’ అని చంద్రబాబు తెలిపారు. రైతులు భూములు ఇచ్చిన తర్వాతే రాజధాని వచ్చిందని... ఏది ఎక్కడ రావాలో నిర్ణయించేందుకు సమయం పడుతుందని చెప్పారు. ఏపీలో హైకోర్టు కట్టుకున్న తర్వాత తరలిస్తే... ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకు వస్తుందని విభజన చట్టంలో చెప్పారని గుర్తు చేశారు. ‘‘గొడవలు పెట్టుకోవాలని నాకు లేదు. ఏవైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. చట్టం అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది తప్ప, తమకు అనుకూలంగా ఉన్నది మాత్రమే చెయ్యాలనడం కరెక్టు కాదు. కలసి మాట్లాడుకుందామని నేను మొదటి నుంచీ చెబుతున్నాను. మనతో కానప్పుడు ఢిల్లీ పెద్దలను పరిష్కారం చేయమందాం’’ అని చంద్రబాబు తెలంగాణకు సూచించారు. సామరస్యంగా పరిష్కారం చేసుకోకుండా గొడవలు పడితే ఎవరికీ లాభం లేదని సీఎం వ్యాఖ్యానించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment