తాజా వార్తలు

Monday, 4 July 2016

కేంద్రం తకరారు రాష్ట్రం బేజారు

విభజన సమస్యల పరిష్కారం, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య సయోధ్య కుదరని అంశాలపై విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. కానీ, ఆ బాధ్యత తీసుకోకుండా... ఇరు రాష్ట్రాల సెక్రటరీలు కూర్చుని పరిష్కరించుకోండని ప్రతిసారీ సలహాలివ్వడంపై రాష్ట్ర అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెలంగాణ సహకరించకపోతే కేంద్రం, కేంద్రం కూడా సహకరించకపోతే కొన్నాళ్లు వేచిచూసి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఇటీవల చైనా పర్యటన ముగించుకుని వస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అధికారులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని, ఇతర అధికారులను కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో కూడా కేంద్ర అధికారుల నుంచి ఒకే రకమైన సమాధానం రావడంతో నిరాశ చెందామని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు.
 
 
రెవెన్యూలోటు భర్తీ కష్టమే
రూ.16,000కోట్లకుపైగా రెవెన్యూలోటు ఉంటుందని మొదట కేంద్రానికి కాగ్‌ నివేదిక పంపింది. ఈ లోటులో రూ.7,000 కోట్ల రుణమాఫీ నిధులు కూడా ఉన్నాయి. రుణమాఫీ అనేది ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీ అని, దాంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో, అప్పటి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీవీ రమేశ్‌... ఆ లెక్కలను సవరించి, అందులో కేవలం రూ.3వేల కోట్లే రుణమాఫీకి వినియోగించామని, మిగిలిన రూ.4వేల కోట్లు రైతు సాధికారత కోసం వినియోగించినట్లు మార్చి... మళ్లీ కేంద్రానికి పంపారు. రైతు సాధికారత కోసం ఏ విధంగా ఆ నిధులు ఖర్చు పెట్టారు? ఏయే పథకాలు అమలు చేశారు? దానివల్ల రైతులు ఎంతవరకూ బాగుపడ్డారు? అనే అంశాలపై వివరాలు కావాలని కేంద్రం కోరడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల బడ్జెట్‌ను కూడా అమాంతం పెంచేసి, ఆ మొత్తాన్ని రెవెన్యూలోటు కింద చూపడంతో కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన పథకాలకు ఖర్చు పెట్టిన మొత్తాన్నే రెవెన్యూలోటు కింద భర్తీ చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అపాయింటెడ్‌ డే తర్వాత నుంచి అమలుచేస్తున్న కొత్త పథకాలతో తమకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రతి ఖర్చునూ భూతద్దం పెట్టి పరిశీలిస్తోంది. అధికారులు మాత్రం... రాష్ట్రం తరఫున తాము ప్రయత్నలోపం లేకుండా పోరాడుతున్నామని అంటున్నారు. కేంద్రం కూడా సొంతంగా రాష్ట్ర రెవెన్యూలోటు లెక్కలపై కసరత్తు చేస్తోందని, కాగ్‌, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను పక్కనపెట్టి సొంతంగా తేలిన రెవెన్యూలోటునే భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
 

ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుపై కొంత సానుకూలత
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కోరుతూ ఆర్థికశాఖ గతంలో పంపిన లేఖపై కూడా కేంద్రం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఎఫ్‌ఆర్‌బీఎం రాష్ట్రచట్టం.. ముందు మీరు సవరించుకొని.. మమ్మల్ని అడగండి’ అంటూ ఏకవాక్యంతో కేంద్రం నుంచి తిరుగు సమాధానం వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరించాలని రాష్ట్రం భావిస్తోంది. ఈ సవరణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపి ఆమోదం పొందాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం రాష్ట్రాలకు ఉన్న 3 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఇందుకు అన్ని రాష్ర్టాలకూ ప్రామాణికాలను నిర్దేశించింది. రాష్ర్టాలు వాటిని చేరుకుంటేనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచుకునే అవకాశం ఇచ్చింది. కానీ, వీటిలో ఏపీకి ఏదీ అనుకూలంగా లేదు. కాబట్టి, ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు లేనట్టే. అలాగే, రాష్ట్రం పంపిన జీఎ్‌సడీపీ గణాంకాల ప్రకారం రూ.20,500కోట్లు రుణం తీసుకునే అవకాశం ఉండేది. కానీ, కేంద్రం కొర్రీలు విధించడంతో రుణాలు తీసుకునే పరిమితి రూ.1850 కోట్లకు పడిపోయింది. దీంతో రూ.20,500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని, నవ్యాంధ్రను ప్రత్యేక కేసుగా పరిగణించి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర అధికారులు చెప్పినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.
 


పీఆర్సీ విడుదల చేసుంటే...

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 10వ పీఆర్సీ వర్తింపజేయాలని ఉమ్మడిరాష్ట్రంలో నిర్ణయించారు. రాష్ట్రాలు విడిపోయాక దాన్ని అమలుచేశారు. కానీ, నిధులు లేవనే కారణంతో 2014 జూన 2 నుంచి 2015 మార్చి 30వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ ప్రభుత్వం పీఆర్సీ చెల్లించలేదు. ఆ బకాయిలు రూ.4,000 కోట్ల వరకూ ఉన్నాయి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం 10 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించినట్లయితే ఆ అదనపు మొత్తాన్ని రెవెన్యూలోటు కింద చూపిస్తే తాము విడుదల చేసేవాళ్లమని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, ఇప్పుడు విడుదల చేస్తే కేంద్రం నుంచి ఆ నిధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని అధికారులు అంటున్నారు. పైగా, కేంద్రానికి పంపిన రెవెన్యూలోటు రూ.16,000 కోట్లలో పీఆర్సీ బకాయిలను చేర్చలేదని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment