తాజా వార్తలు

Friday, 8 July 2016

చంద్రబాబుకు సున్నా మార్కులే

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా దారుణంగా మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలు సున్నా మార్కులే వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చె ప్పారు? ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు ఏయే హామీలు ఇచ్చారు? వాటిని ఏ మేరకు అమలు చేశారు?’’ అనే విషయాలను తెలియజెప్పి ప్రజలను చైతన్యపర్చడమే ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతుల రుణాలు బేషరతుగా, పూర్తిగా మాఫీ చేస్తామని 2013 ఏప్రిల్ 27న పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు ప్రకటించారు. రైతన్నలు, అక్కాచెల్లెమ్మలు వ్యవసాయ ఖర్చుల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వెనక్కి ఇప్పిస్తానని 2013 ఫిబ్రవరి 23న గుంటూరు జిల్లా భట్టిప్రోలులో, 2014 ఏప్రిల్ 18న మచిలీపట్నంలో చంద్రబాబు చెప్పారు. ఇంటికో ఉద్యోగం, అది వచ్చేంతవరకూ రూ.2 వేలు నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాలు మాఫీ, మూడు సెంట్ల స్థలంతోపాటు రూ.1.5 లక్షలతో అందరికీ ఇళ్లు... ఇలా చంద్రబాబు అనేక హామీలను గుప్పించారు. ఆ హామీలను ఎక్కడ ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్న విషయాలతో కరపత్రం రూపొందించాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాలకులు అబద్ధాలు చెబితే, మోసం చేస్తే ప్రజలు తిరగబడాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు.

 ప్రతి గడపకూ కరపత్రాలు
 ‘‘రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. హామీలను అమలు చేయకుండా మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు నిలదీయకపోతే రేప్పొద్దున ఇంటింటికీ కారు, విమానం కొనిస్తానంటూ తప్పుడు వాగ్దానాలు ఇస్తారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. అందుకే ప్రజా బ్యాలెట్ ఇచ్చాం. కరపత్రంలో ప్రశ్నలు ఇచ్చాం. కరపత్రంలో ప్రశ్నలకు ఎదురుగా టిక్ పెట్టాలని చెప్పాం. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబుకు సున్నా మార్కులు వస్తున్నాయి. ప్రతి గడపకు ఈ కరపత్రాలను అందజేస్తాం. చంద్రబాబు మోసాలను బట్టబయలు చేస్తాం. ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ తిరుగుతాం. రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడ నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటా. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచే యాలి. మీడియా కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. రాజకీయ నాయకుల హామీలైపై ప్రశ్నించాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

 రెండేళ్లలోనే రూ.1,45,549 కోట్ల అవినీతి
 ‘‘ముఖ్యమంత్రిగా చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.1,45,549 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కరపత్రంలో ఒక కథ రాశాం. రాజుగారి వస్త్రాలు గొప్పగా ఉన్నాయంటూ మంత్రులు పొగడ్తల వర్షం కురిపించారు. ప్రజల మధ్యకు వెళితే వస్త్రాలే లేకుండా తిరుగుతున్నావని చెప్పారు. చంద్రబాబు పాలన కూడా ఆలాగే కొనసాగుతోంది. ప్రజల మధ్యకు వెళితే వారికి తెలుస్తోంది’’ అని జగన్ అన్నారు.

 ఇడుపులపాయలో గడప గడపకూ జగన్
 ఇడుపులపాయ... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆ గ్రామం నుంచే ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు గ్రామానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ఇంటింటికీ వెళ్లారు. తొలుత పోతిరెడ్డి రామచంద్ర ఇంటికి వెళ్లారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు ఇచ్చిన హామీలు, సీఎంగా ఆయన వైఫల్యాలను వివరించారు. కరపత్రం అందించారు. తీరిగ్గా చదవాలని, ఆపై ప్రశ్నలకు సమాధానాలు టిక్ చేయాలని కోరారు. సీఎంకు మీరే మార్కులు వేయాలని సూచించారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి జనంతో మాట్లాడారు. బాబు ఇచ్చిన హామీలు అమలు తీరుపై జవాబులను రాబట్టారు. చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్క మార్కు కూడా ప్రజలు వేయలేదు.జనం నిలదీస్తారనే భయం ఉంటే రాజకీయ నేతలు తప్పుడు వాగ్దానాలు చేయరని జగన్ చెప్పారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, పలు మండలాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment